
పశ్చిమబెంగాల్ ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ దూసుకెళుతోంది. మొత్తం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. భవానీపూర్ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీ 34 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో దూసుకెళుతున్నారు. జంగిపూర్, సంసర్ గంజ్ నియోజకవర్గాల్లోనూ తృణమూల్ అభ్యర్థుల హవానే కొనసాగుతోంది. ఈ మూడు నియోజకవర్గాల్లో సెప్టెంబరు 30న పోలింగ్ జరగ్గా.. ఈ ఉదయం కౌంటింగ్ ప్రారంభమైంది. తొలి రౌండ్ నుంచే తృణమూల్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. ఈ సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
సీఎం మమతాబెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గం.. తొలి నుంచీ తృణమూల్ కు కంచుకోట. ప్రతి ఎన్నికల్లోనూ మమత ఇక్కడి నుంచే పోటీ చేసి విజయం సాధించేవారు. కానీ, 2019 ఎన్నికల్లో మాత్రం నందిగ్రామ్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తన సన్నిహితుడు సుబేందు అధికారి బీజేపీలో చేరి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తుండడంతో.. ఆయన్ని ఓడించేందుకు మమత.. తన కంచుకోట భవానీపూర్ వీడి మరీ నందిగ్రామ్ లో పోటీ చేశారు. కానీ, 1,700 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. దీంతో.. ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాల్సి ఉండడంతో భవానీపూర్ తృణమూల్ ఎమ్మెల్యే రాజీనామా చేసి.. ఆమెకు అవకాశం కల్పించారు.