
టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతి చంద్ అంచనాల్ని అందుకోలేకపోయింది. సోమవారం జరిగిన మహిళల 200 మీటర్ల హీట్స్‌లో పోటీపడిన ద్యుతీ చంద్.. 23.85 సెకన్లతో చిట్టచివరి స్థానంలో నిలిచింది. దాంతో.. 200మీ సెమీ ఫైనల్స్‌కి ద్యుతీ చంద్ అర్హత సాధించలేకపోయింది. ఈ హీట్స్‌లో నమీబియా స్ప్రింటర్ క్రిస్టైన్ మూమా 22.11 సెకన్లతో టాప్‌లో నిలిచింది.
టోక్యో ఒలింపిక్స్‌లోనే గత శుక్రవారం 100మీ ఈవెంట్లోనూ ద్యుతీ చంద్ ఫెయిలైంది. రేసుని 11.54 సెకన్లలో పూర్తి చేసిన ద్యుతీ చంద్ హీట్‌లో ఏడో స్థానంలో నిలిచింది. దాంతో.. 100మీ రేసులోనూ ద్యుతీచంద్ సెమీ ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ 100మీ పరుగులో ద్యుతీ చంద్ పోటీపడి విఫలమైంది. అప్పట్లో దాదాపు 36 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ 100మీ పరుగులో పోటీపడిన మహిళా అథ్లెట్‌గా ద్యుతీ చంద్ నిలిచింది. కానీ.. వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో ఈ భారత స్ప్రింటర్ నిరాశపరిచింది.
పటియాలాలో ఇటీవల జరిగిన అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ 100మీ పరుగులో ఊహించని విధంగా నాలుగో స్థానంతో సరిపెట్టిన 25 ఏళ్ల ద్యుతి చంద్.. ఒలింపిక్స్‌కి నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. అయినప్పటికీ.. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో నిలవడం ద్వారా.. 100మీ, 200మీ పరుగులలో ఒలింపిక్స్ బెర్తులను ద్యుతీ చంద్ దక్కించుకుంది. కానీ.. అంచనాల్ని అందుకోలేకపోయింది.