
ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రోలో స్వర్ణకాంతులు వెదజల్లాడు. భారత్ కు స్వర్ణ నీరాజనం పలికాడు. ఈ ఒలింపిక్స్ లోనే భారత్ కు ఏకైక స్వర్ణాన్ని అందించాడు. దేశ కీర్తి పతాకను టోక్యో ఒలింపిక్ ట్రాక్ లో సగర్వంగా ఎగురవేశాడు. వందేళ్ల తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్ లో భారత్ కు పతకం అందించాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన చోప్రా.. తొలి ప్రయత్నంలో 87.03 మీటర్లు విసిరి అబ్బుర పరిచాడు. రెండో ప్రయత్నంలో అంతకు మించి 87.58 మీటర్లు విసిరి తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. మూడో ప్రయత్నంలో మాత్రం కాస్త పట్టు తప్పడంతో 76.79 మీటర్లే విసిరాడు. అయినప్పటికీ నీరజ్.. తొలి స్థానంలోనే నిలిచాడు. 86.67 మీటర్లు విసిరిన చెక్ రిపబ్లిక్ క్రీడాకారుడు రజతం గెలుచుకోగా.. 85.44 మీటర్లు విసిరిన మరో చెక్ ప్లేయర్ కాంస్యం గెలుచుకున్నాడు. మొత్తానికి ఈ ఒలింపిక్స్ ను భారత్.. ఏడు పతకాలతో ముగించింది. అందులో 1 స్వర్ణం, 2 రజతాలు సహా 4 కాంస్య పతకాలు ఉన్నాయి.
భారత కుస్తీ వీరుడు బజరంగ్ పూనియా అద్భుతం చేశాడు. పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లో కాంస్యం ‘పట్టు’ పట్టాడు. భారీ ఆశలు అంచనాల మధ్య టోక్యో వెళ్లిన బజరంగ్.. సెమీస్ లో ప్రపంచ చాంపియన్ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఇవాళ.. కాంస్యం కోసం పోరులో కజకిస్థాన్ కు చెందిన దౌలత్ నియజ్ బెకోవ్ ను 8-0 తేడాతో చిత్తు చేశాడు. ఏకపక్షంగా సాగిన ఈ బౌట్ లో బజరంగ్.. ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. తిరుగులేని ప్రదర్శనతో ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా మ్యాచ్ ను ముగించాడు. ఈ విజయంతో భారత్ పతకాల సంఖ్య 6కు చేరుకుంది.