
భారత్, ఇంగ్లాండ్ మధ్య ఆసక్తికర టెస్టు సిరీస్‌కి బుధవారం తెరలేవనుంది. నాటింగ్‌హామ్ వేదికగా ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకి ఫస్ట్ టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. మొత్తం ఐదు టెస్టుల సిరీస్‌ని అక్కడ టీమిండియా ఆడనుంది. గాయాలతో ఓపెనర్ శుభమన్ గిల్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సిరీస్ మొత్తానికీ దూరమవగా.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కాంకషన్‌కి గురై తొలి టెస్టుకి దూరంగా ఉండనున్నాడు. దాంతో.. తుది జట్టు ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.
ఇంగ్లాండ్ గడ్డపై సుదీర్ఘకాలంగా టెస్టుల్లో టీమిండియా తడబడుతోంది. 1976, 1986, 2007లో మాత్రమే అక్కడ టెస్టు సిరీస్‌లు గెలిచిన భారత్ జట్టు.. తర్వాత ఏ పర్యటనలోనూ సిరీస్‌ని చేజిక్కించుకోలేకపోయింది. జూన్ చివర్లో అక్కడే సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా నిరాశపరిచిన విషయం తెలిసిందే. దాంతో.. ఈ టెస్టు సిరీస్‌లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుంది..? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
నాటింగ్‌హామ్ పిచ్ పేస్‌కి అనుకూలించే సూచనలు కనిపిస్తుండటంతో.. భారత్ కేవలం ఒక స్పిన్నర్ (అశ్విన్)తో బరిలోకి దిగే అవకాశం ఉంది. పేస్ ఆల్‌రౌండర్‌గా శార్ధూల్ ఠాకూర్ ఆడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలానే రోహిత్ శర్మకి జోడీగా మయాంక్ అగర్వాల్ స్థానంలో కేఎల్ రాహుల్ లేదా అభిమన్యు ఈశ్వరన్ ఆడనున్నారు. అన్నింటికీ మించి గత ఏడాదన్నరగా సెంచరీ కోసం నిరీక్షిస్తున్న విరాట్ కోహ్లీ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడు..? అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ఇంగ్లాండ్‌తో సిరీస్‌కి భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, సాహా (వికెట్ కీపర్), అభిమన్యు ఈశ్వరన్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్
తొలి రెండు టెస్టులకి ఇంగ్లాండ్ జట్టు ఇదే: జోరూట్ (కెప్టెన్), క్రెయిగ్ ఎవర్టన్, రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లీ, జోస్ బట్లర్, మార్క్‌వుడ్, శామ్ కరన్, జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్‌స్టో, డొమినిక్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ క్రావ్లీ, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీ, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్.