
ఆషాడ మాసంలో మూడవ ఆదివారం నాడు జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు అధికారులు తగిన ఏర్పాట్లు చేసింది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ, అమ్మవారిని దర్శించుకోవాలని ప్రభుత్వం సూచనలు చేసింది. ఈ మేరకు అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ లు ధరించి, శానిటైజర్ వినియోగించాలని ఆలయ వర్గాలు కోరుతున్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బోనం ఎత్తుకొని వచ్చే మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ఈనెల 25, 26 తేదీల్లో జరిగే ఉత్సవాల సందర్భంగా ఆలయం సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు 25వ తేదీ తెల్లవారు జాము 4 గంటల నుంచి పూజలు పూర్తయ్యే వరకు, మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. బోనాల పండుగ సందర్భంగా వచ్చే భక్తుల తో ఆలయం సమీపంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాలను దారి మళ్లిస్తున్నట్టు కమిషనర్ తెలిపారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.