
ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతులెత్తేసింది. అటు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ విఫలమై.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. 139 పరుగుల లక్ష్యాన్ని కోల్ కతా నైట్ రైడర్స్ 4 వికెట్లు కోల్పోయి ఛేధించింది. కోల్ కతా ఓపెనర్లు శుభ్ మన్ గిల్(29), వెంకటేశ్ అయ్యర్(26) రాణించారు. నితీశ్ రానా 23, సునీల్ నరైన్ 26 రన్స్ చేశారు. ఈ గెలుపుతో క్వాలిఫయర్-2 మ్యాచ్ కు మోర్గాన్ సేన అర్హత సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, సిరాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు వచ్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు దేవదత్ పాడిక్కల్, విరాట్ కోహ్లీ మొదటి వికెట్ కు 49 పరుగులు జోడించారు, ఆ తర్వాత 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దేవదత్ పాడిక్కల్ అవుటయ్యాడు. ఆ తర్వాత గత మ్యాచ్ లో అదరగొట్టిన శ్రీకర్ భరత్ బ్యాటింగ్ కు వచ్చి 16 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. భరత్ అవుట్ అయిన కాసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ 39 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత బెంగళూరు జట్టు స్కోరు బోర్డు నెమ్మదించింది.
విరాట్ కోహ్లీ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మాక్స్ వెల్ 15 పరుగులు, డివిలియర్స్ 11 పరుగులు, షాబాజ్ అహ్మద్ 13 పరుగులు చేశారు. అయితే చివరి ఓవర్లో హర్షల్ పటేల్ ఒక బౌండరీ బాదాడు. కోహ్లి సేన 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 138 పరుగుల చేసింది.