
‘‘బీజేపీ, వైసీపీల మధ్య చీకటి బంధం కొనసాగుతోంది. పైకి శత్రువుల్లా నటించే రహస్య మిత్రులు వాళ్లు. ఆర్థిక నేరగాడు విజయసాయి రెడ్డిని పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో నియమించడమే దీనికి నిదర్శనం…’’ అని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఎన్ఎండీ ఫరూక్ ఆరోపించారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కరడు గట్టిన ఆర్థిక నేరగాడని, ఆయన బెయిల్ రద్దుపై ఈ నెల 13 న కోర్టులో విచారణ కూడా జరగబోతోందని తెలిపారు. ‘‘న్యాయమూర్తులను దూషించిన వైసీపీ పార్టీ కార్యకర్తలను ఆయన వెనకేసుకొచ్చారు. వారికి అండగా నిలుస్తామని ప్రకటించారు. అటువంటి వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం.. పీఏసీలో సభ్యుడిగా నియమించింది. దీని ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? బీజేపీ, వైసీపీల మధ్యనున్న లోపాయికారీ ఒప్పందానికి ఈ నియామకమే నిదర్శనం’’ అని ఫరూక్ విమర్శించారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే అదేదో మహా అపరాధం అన్నట్లు ఈ వైసీపీ నేతలు గగ్గోలు పెట్టారని, ఇప్పుడు అదే వైసీపీ ఏం మొహం పెట్టుకుని కేంద్రంతో అంటకాగుతోందని ఫరూఖ్ ప్రశ్నించారు. బీజేపీతో చీకటి స్నేహం చేస్తూ.. మైనారిటీలను వైసీపీ వంచిస్తోందని ఆరోపించారు. ‘‘పోలీసుల దాష్టీకంతో నంద్యాలలో అబ్దుల్ సలాం తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకొంటే.. ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ ఘటనపై అసలు విచారణే లేదు. చర్యలు అసలే లేవు’’ అని ఫరూక్ విమర్శించారు.