
అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. తాను చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు డ్రగ్స్ చాలెంజ్ పేరుతో కొత్త నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. పాదయాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తో కలిసి ఆయన మాట్లాడారు. పంట ఉత్పత్తుల కొనుగోలులో ప్రభుత్వం వెనకడుగు వేస్తే సీఎం కేసీఆర్ ఫాం హౌస్ ను వెయ్యి నాగళ్లతో దున్నేస్తామని హెచ్చరించారు. రైతులతో కలిసి ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని పేర్కొన్నారు. వరి వేస్తే ఉరేనని, మొక్క జొన్న వేస్తే రైతు బంధు ఇవ్వబోమని ప్రకటనలు చేయడం దుర్మార్గమని అన్నారు. పంటల విషయంలో రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కామారెడ్డి జిల్లాకు కాళేశ్వరం నీళ్లు తీసుకువస్తానని ఏడేళ్ల క్రితం కాళేశ్వరం 21వ ప్యాకేజీ పనులకు ప్రభుత్వం ఓకే చెప్పినా.. ఇప్పటికీ పనులు పూర్తికాలేదని అన్నారు. కేసీఆర్కు కమీషన్లు రాకపోవడంతోనే పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. కామారెడ్డి సభలో ఆయన ప్రసంగిస్తూ మోదీ ప్రభు త్వం ఉపాధి హామీ పనులు, జాతీయ రహదారులు, ఇళ్ల నిర్మాణాలు, గ్రామాల అభివృద్ధి..ఇలా అనేక పథకాల కింద రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తోందని ఆయన చెప్పారు. కానీ, తెలంగాణలోని ప్రభుత్వం.. అవన్నీ వారి పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని ధ్వజమెత్తారు.