
కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ బీజేపీలో చేరనున్నారా..? ప్రస్తుతం ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఇవే చర్చలు నడుస్తున్నాయి. ఈ దిశగా మళ్లీ ఊహాగానాలు జోరందుకున్నాయి. భవిష్యత్తులో ఆయన తమ పార్టీలో చేరవచ్చంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఏపీ అబ్దుల్ కుట్టి తాజాగా సంకేతాలిచ్చారు. సచిన్ పైలట్ మంచి నేత అని, భవిష్యత్తులో ఆయన బీజేపీలో చేరతారని తాను భావిస్తున్నానని చెప్పారు.
సచిన్ పైలట్.. తనకు విధేయులైన 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై గత ఏడాది తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. అప్పుడే ఆయన బీజేపీలో చేరతారని బలంగా ప్రచారం జరిగింది. అయితే, ఆ ఊహాగానాలను పైలట్ తోసిపుచ్చారు. అలాంటి ఆలోచన ఏదీ లేదని వివరణ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఇవే ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి. ఈ నెలలోనే గెహ్లాట్ మంత్రివర్గ విస్తరణతో పాటు రాజకీయ నియామకాలు చేపట్టనున్నారు. తాను లేవనెత్తిన అంశాలపై పార్టీ సరైన చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నట్టు సచిన్ పైలట్ గత నెలలో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గెహ్లాట్ మంత్రివర్గంలో 21 మంది మంత్రులు ఉండగా, మరో తొమ్మిది మందికి చోటు కల్పించే అవకాశం ఉంది.