
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసం సహా మూడు ప్రధాన రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు బిగ్‌బీ నివాసం, రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను పెంచి విస్తృత తనిఖీలు చేపట్టారు. ముంబయి పోలీసు ప్రధాన కంట్రోల్ రూమ్ కు శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఓ కాల్ వచ్చింది. ఛత్రపతి శివాజీ మహరాజ్ టర్మినస్, బైకుల్లా, దాదర్ రైల్వే స్టేషన్లు, జుహూలోని అమితాబ్ నివాసం వద్ద బాంబులు పెట్టినట్లు ఆగంతకుడు సమాచారమిచ్చాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు సమాచారమిచ్చారు. బాంబు స్క్వాడ్, జాగిలాలను తీసుకొని బిగ్‌బీ నివాసం సహా రైల్వే స్టేషన్ పరిసరాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎటువంటి అనుమానస్పద వస్తువులు గాని పేలుడు పదార్ధాలు గాని లభించలేదు. దీంతో అది నకిలీ బెదిరింపు కాల్ అని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బిగ్ బీ నివాసం సహా రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు. కాల్ ఎవరు చేశారు… ఎందుకు చేశారనే కోణంలో దర్యాప్తు మాత్రం కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.