
యాదాద్రి లక్ష్మీనరసింహాలయం కొత్త శోభను సంతరించుకోనుంది. గర్భాలయంపై 45అడుగుల ఎత్తుతో నిర్మించిన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని యాడా (యాదాద్రి డెవలప్ మెంట్ అథారిటీ) నిర్ణయించింది. దీని కోసం సుమారు 60 కేజీల బంగారం అవసరమవుతుందని యాడా, ఆలయ అధికారులు అంచనా వేశారు. దానిని దాతల నుంచి సేకరించాలని నిర్ణయించినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. బంగారం విరాళానికి దాతలు ముందుకు రావాలని కోరారు.
ఉత్సవ మూర్తుల నిత్య ఉత్సవాలకు వినియోగించే కొయ్య రథానికి స్వర్ణ తొడుగులు అమర్చే పనులు తుదిదశకు చేరుకున్నాయి. రాగి తొడుగుల తయారీ పూర్తయింది. వాటికి బంగారు తాపడం చేసి.. టేకు రథానికి అమర్చే పని మిగిలింది. దీనిని పది రోజులలో పూర్తి చేస్తామని ఈ పనులు చేస్తున్న చెన్నైకు చెందిన స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ తెలిపింది. ఈ నెలాఖరు లోపు రథం యాదాద్రికి చేరుకునే అవకాశముంది. స్వర్ణ రథానికి అయ్యే రూ.60 లక్షల ఖర్చును శ్రీలోగిళ్లు, ల్యాండ్‌మార్క్ రియల్ ఎస్టేట్ సంస్థల అధినేతలు సురేశ్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి భరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానాలయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేస్తున్నారు. గత జూన్ 21న క్షేత్రాన్ని సందర్శించిన ఆయన అభివృద్ధి పనులపై పలు సూచనలు చేశారు. సీఎం ఆదేశాలతో పనులను చకాచకా పూర్తి చేస్తున్నారు. క్షేత్రాభివృద్ధి పనులను పరిశీలించి, ఆలయ ఉద్ఘాటనకు ముహూర్తం నిశ్చయించడానికి సీఎం కేసీఆర్ త్వరలో యాదాద్రి రానున్నారు.