
భాగ్యనగరం ఇవాళ పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనాలు జరగనున్నాయి. అందులో భాగంగా ప్రసిద్ధ ఖైరతాబాద్ వినాయకుడు శోభాయాత్ర ప్రారంభమైంది. వినాయకుడిని ట్రాలీపైకి ఎక్కించిన నిర్వహకులు కార్యక్రమాన్ని వైభవంగా మొదలుపెట్టారు. విజయవాడ నుంచి తెప్పించిన ప్రత్యేక ట్రాలీపై గణేశుడిని ఎక్కించి వెల్డింగ్ పనులను తెల్లవారుజామునే పూర్తి చేశారు. యాత్ర ప్రారంభం కావడంతో ఊరేగింపు రథంపై మహాగణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. వినాయకుడి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. నిమజ్జనోత్సవాల్లో భాగంగా జీహెచ్ఎంసీ భక్తులకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తోంది.
ఈ శోభాయాత్ర హుస్సేన్‌సాగర్ వరకు 17 కి.మీ మేర జరగనుంది. ప్రత్యేక పూజల అనంతరం మహాగణపతి గంగ ఒడికి చేరనున్నాడు. క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం జరగనుంది. నగరంలో పెద్ద ఎత్తున కొనసాగనున్న నిమజ్జనానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర కొనసాగే మార్గాలలో ట్రాఫిక్ మళ్లించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.
మరోవైపు బాలాపూర్ గణేశుడి ఊరేగింపు వైభవంగా కొనసాగుతోంది. భజన బృందం పాటలు, డప్పుచప్పుళ్ల సందడి నడుమ కార్యక్రమం ముందుకు సాగుతోంది. బాలాపూర్‌లోని ప్రధాన వీధుల్లో గణనాథుడిని ఊరేగిస్తున్నారు. ఊరేగింపు అనంతరం బాలాపూర్ ముఖ్య కూడలిలో లడ్డూ వేలంపాట నిర్వహించనున్నారు. 27 ఏళ్లుగా లడ్డూ వేలంపాట నిర్వహిస్తున్న ఉత్సవ సమితి యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
కాగా, ఇప్పుడే ఈ ఏడాది వేలంపాట ముగిసింది. అబాకస్ ఇన్ స్టిట్యూషన్స్ మేనేజ్ మెంట్ తరఫున ప్రతినిధి మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ గారు 18.9 లక్షల ధరతో బాలాపూర్ లడ్డు ని వేలంపాట లో దక్కించుకున్నారు.
ఆదివారం ఉదయం మంత్రి సబితా ఇంద్రారెడ్డి లడ్డూ వేలం పాటను ప్రారంభించారు. వేలం అనంతరం రమేశ్ యాదవ్ మాట్లాడుతూ వేలం పాటలో లడ్డూను దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఈ ప్రసాదాన్ని అందజేస్తామని పేర్కొన్నారు.
బాలాపూర్ లడ్డూకు ప్రత్యేక విశిష్టత ఉంది. 1994లో ఇక్కడ లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. అప్పటి నుంచి ఏటా రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. లడ్డూను తీసుకున్న వారికి మంచి జరుగుతుందని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని, పొలాల్లో చల్లితే పంటలు బాగా పడుతాయని ప్రతీతి. అందుకే బాలాపూర్ లడ్డూకు దేశ వ్యాప్త గుర్తింపు ఉంది. కొవిడ్ కారణంగా గత ఏడాది మాత్రమే వేలం పాట జరగలేదు. అంతకు ముందు ఏడాది కొలను రాంరెడ్డి రూ.17.60లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.