
పోలవరం ప్రాజెక్టు పునరావాసం కోసం ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ బిల్లునూ ఆపడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. లోక్ సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్.. ఈ మేరకు బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన పోలవరం పునరావాసం వివరాలను వెల్లడించారు. ‘‘ఏపీ ప్రభుత్వం అందించిన పునరావాస వివరాల ప్రకారం.. పోలవరం నిర్వాసిత కుటుంబాలు 1,06,006. అందులో ఇప్పటి వరకు 4,283 కుటుంబాలకే పునరావాసం అందింది. పునరావాసానికి సంబంధించిన ఖర్చును 2014 నుంచి కేంద్రం చెల్లిస్తోంది. ఏపీ నుంచి వచ్చిన బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తున్నాం. ప్రస్తుతం ఒక్క బిల్లు కూడా పెండింగ్ లో లేదు. పీపీఏ, సీడబ్ల్యూసీ తనిఖీల తర్వాత బిల్లులు చెల్లిస్తున్నాం. భూసేకరణ, పునరావాసం కింద ఇప్పటివరకు రూ.11,181 కోట్లు చెల్లించాం’’ అని వెల్లడించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల పనులు సాగడం లేదని, ఎన్ని సార్లు టెండర్లు పిలిచినా.. కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేదని షెకావత్ తెలిపారు.
కాగా, కృష్ణా ప్రాజెక్టులపై నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు జవాబిచ్చిన షెకావత్.. గెజిట్ వివరాలను వెల్లడించారు. కృష్ణా నదిపై అనుమతులు లేని ప్రాజెక్టుల నిర్మాణం ఆపాల్సిందేనని స్పష్టం చేశారు. ఆరు నెలల్లో అనుమతులు తెచ్చుకోలేకపోతే నిర్మాణాలను పూర్తిగా ఆపేయాలని పేర్కొన్నారు. గత నెలలో విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఇదే విషయం స్పష్టం చేశామన్నారు.