
ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట పులిచింతల ప్రాజెక్ట్ గేటు విరిగిపోయి, ప్రాజెక్ట్ ప్రమాదంలో పడిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పులిచింతల ప్రాజెక్టు 16వ నెంబర్ గేటు ఊడిపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. పర్యవేక్షణాలోపాల వల్ల నీరు వృథాగా సముద్రం పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పులిచింతల ప్రాజెక్టు 16వ నెంబర్ గేటు ఊడిపోవడం వల్ల మిగిలిన గేట్లపై ఒత్తిడి పెరిగిపోతుందని.. ఇది ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నా పాలకులు మౌనంగా ఉండటం ఏమిటని పవన్ ప్రశ్నించారు. పులిచింతల ప్రాజెక్ట్ భద్రతపై ముఖ్యమంత్రి అత్యవసర సమీక్ష ఎందుకు చేపట్టలేదని నిలదీశారు. 44 టీఎంసీల నీటి నిల్వలు ఉన్న ఈ ప్రాజెక్టును ఇప్పుడు ఎలా కాపాడుతారో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పాలకులకు – వ్యక్తిగత ప్రచారం వచ్చే కార్యక్రమాలపై మాత్రమే దృష్టి ఉంటోందన్న పవన్., వాటికే నిధులు మళ్లించి సమీక్షల పేరిట ప్రచారం చేస్తున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులు, వాటి నిర్వహణపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేయాలనే శ్రద్ధ లేదని మండిపడ్డారు. గేటు విరిగిపోవడం వల్ల 34 టీఎంసీల జలాలు సముద్రం పాలవుతున్నాయని, పై నుంచి పులిచింతలకు వచ్చే మరో 15 టీఎంసీలను కూడా సముద్రంలోకే వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇందుకు కారణం ప్రాజెక్ట్ విషయంలో జలవనరుల శాఖ నిర్లక్ష్యమేనన్నారు. ఇప్పటికైనా పులిచింతలతోపాటు రాష్ట్రంలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణపై శ్రద్ధపెట్టి ప్రత్యేక నిధులు కేటాయించి రక్షణ చర్యలు చేపట్టాలని పవన్ కోరారు.