
మన టాలీవుడ్ హీరోలు ఆపదలో ఉన్న అభిమానులకు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కొండంత అండగా ఉంటుంటారు. సినిమాల్లో హీరోయిజం చూపించడం మాత్రమే కాకుండా నిజ జీవితంలోనూ సామాజిక సేవకు ముందుకు వస్తారు. తాజాగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ అభిమాని మోములో ప్రభాస్ చిరునవ్వులు పూయించాడు. ఎంతో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ అభిమాని కోరిక తీర్చేందుకు కాస్త సమయం కేటాయించాడు. క్యాన్సర్‌తో పోరాడుతూ ఆస్పత్రిలో చేరిన ‘శోభిత’ అనే యువతి కోరిక మేరకు ముంబయిలో ఉన్న ప్రభాస్ వీడియో కాల్లో కాసేపు మాట్లాడి ఆమెను సంతోషపెట్టాడు. ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా సమయం కేటాయించి అభిమానితో మాట్లాడిన ప్రభాస్‌ను ఆస్పత్రి వర్గాలు ప్రశంసించాయి. ఓ క్యాన్సర్ పేషంట్ ముఖాన చిరునవ్వు చిగురించడానికి ప్రభాస్ కారణమయ్యాడు అంటూ మెచ్చుకున్నారు. గతంలో కూడా ప్రభాస్ “మిర్చి” సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు, భీమవరంలో మృత్యువుకు దగ్గరవుతున్న తన 20 ఏళ్ల అభిమానిని ఇలాగే ఆశ్చర్యపరిచాడు. ప్రభాస్‌ను చూసిన తర్వాత బాలుడు 20 రోజులకు పైగా జీవించాడని అతని తండ్రి మీడియాతో చెప్పాడు.