
హైదరాబాద్‌లోనే కాదు యావత్తు దేశంలో టీ20 క్రికెట్ మేనియా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2021 టీ20 ప్రపంచ కప్ టీమిండియా గెలవాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్ ఒడిపోవాలని కాదు.. ఇండియా గెలవాలని కోరుకుంటున్నామంటున్నారు అభిమానులు. ఈ సందర్భంగా క్రికెట్ ప్రియుల్లో మరింత జోష్ నింపేందుకు సిద్ధమయ్యారు మాజీ క్రికెటర్ అజారుద్దీన్. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ బ్యాట్‌ను ఏర్పాటు చేశారు. 56.1 అడుగుల పొడవు, 9 టన్నుల బరువున్న ఈ క్రికెట్ బ్యాట్ ను అజారుద్దీన్, తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ అవిష్కరించారు.
ఈ సందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ.. ఈ రోజు జరుగబోయే మ్యాచ్‌లో భారత జట్టులో బ్యాలెన్సింగ్ ఉందని, ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయన్నాడు. పాకిస్తాన్ జట్టును కూడా తక్కువ అంచనా వేయలేం అంటూ వ్యాఖ్యానించాడు. కాగా ఈ లార్జెస్ట్ బ్యాట్‌ని పెర్నోడ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమెటెడ్ రూపొందించగా.. గిన్నీస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు చేసుకుంది. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ఈ బ్యాట్‌ను సదరు సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది.