
వైసీపీ ఎంపీలు.. రాష్ట్ర సమస్యలను పక్కనబెట్టి తమ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామరాజుపై పోరాటం చేయడంలో మునిగి తేలుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం విమర్శించారు. ప్రజల అజెండాను గాలికి వదిలేసి.. తమ అధినేత పగ, ప్రతీకారాలను భుజాలకెత్తుకుని ఢిల్లీలో తిరుగుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేకహోదా, పోలవరం కన్నా.. వైసీపీ ఎంపీలకు రఘురామరాజే అతి పెద్ద సమస్యగా మారారన్నారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్ అవినీతి కేసుల్లో సహ నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ ను సెర్బియాలో అరెస్టు చేయగానే.. ఆయన విడుదలకు ప్రయత్నించాలంటూ కేంద్ర మంత్రుల వద్దకు పరుగులు తీశారు ఈ వైసీపీ ఎంపీలు. ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న రఘురామరాజుపై దర్యాప్తు జరిపించాలంటూ మళ్లీ కేంద్ర మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. జగన్ కు చిన్న సమస్య వచ్చినా హడావుడి చేసే ఈ వైసీపీ ఎంపీలకు.. రాష్ట్ర సమస్యలు పట్టవా..?’’ అని ప్రశ్నించారు.
మనీ లాండరింగ్ అంశంలో రఘురామరాజుపై విచారణ చేయాలని కోరుతున్న వైసీపీ ఎంపీ విజయసాయిపై పట్టాభి మండిపడ్డారు. ‘‘విజయసాయీ.. నువ్వు 14 మనీలాండరింగ్ కేసుల్లో నిందితుడివి. జగన్ అక్రమాస్తులకు సంబంధించిన అనేక కేసుల్లో ఏ2వి. ఈ కేసుల్లో 16 నెలల పాటు జైల్లో ఉన్నావు. ఇప్పుడు రఘురామరాజుపై విచారణ కోరే అర్హత నీకుందా! నువ్వంత సచ్ఛీలుడివే అయితే.. ముందు నీ కేసుల్లో విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చెయ్యి. మంత్రుల్ని కలిసి ఈ దిశగా విజ్ఞప్తి చెయ్. అంతేగానీ, నీకంటిన బురదను అందరికీ అంటించాలని ప్రయత్నించకు’’ అని పట్టాభి తీవ్రంగా విమర్శించారు. రఘురామరాజు ఫోన్లో ఉన్న వాట్సాప్ సంభాషణలు ఒకటి రెండు చూపించి విచారణ కోరుతున్నారని, వాట్సాప్ మెసేజ్ లను ఆధారాలుగా పరిగణించలేమని ఈ నెల 14న సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన విషయం తెలియదా.. అని ఎద్దేవా చేశారు. రఘురామపై విచారణ కోరిన ఎంపీల్లో అయోధ్య రామిరెడ్డి కూడా ఉన్నారని, తనపై జరిగిన ఐటీ దాడిపై ఆయనెందుకు నోరు మెదపరని అన్నారు. దొంగలను వెంటేసుకుని గజదొంగ విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రుల చుట్టూ తిరగుతున్నారని, ఇందుకు సిగ్గుపడాలని విమర్శించారు. జగన్ పత్రిక, టీవీ.. రెండూ అవినీతి బురదలో నుంచి పుట్టినవేనని, వైసీపీ ఎంపీలు వాటిని వదిలి.. ఇతర మీడియా సంస్థలపై దుష్ప్రచారానికి తెగబడుతున్నారని ఆరోపించారు.