
జీఎస్ టీ మండలి 45వ సమావేశం ఈ శుక్రవారం జరగనుంది. కొవిడ్ విజృంభణ తర్వాత జరగనున్న తొలి ప్రత్యక్ష భేటీలో.. పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ సహా పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశం చర్చకు రావచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ చేర్చాలని జూన్ లో కేరళ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 17న జరిగే సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. జీఎస్ టీ వ్యవస్థలో ఏదైనా మార్పు చేయాలంటే ప్యానెల్ లోని 3/4 ప్రతినిదుల ఆమోదం అవసరం. ఈ జీఎస్టీ ప్యానెల్ లో అన్ని రాష్ట్రాలు, భూభాగాల ప్రతినిధులు ఉన్నారు. దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. చాలా వరకు రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకొని రావడాన్ని గతంలో వ్యతిరేకించాయి. అయితే, గత కొంత కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకడంతో ప్రతి రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్నాయి. ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ ధరలను 39 సార్లు, డీజిల్ ధరను 36 సార్లు పెంచినట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే లోక్ సభలో వెల్లడించింది. ఈ కాలంలో ఒక ఒకసారి పెట్రోల్ ధరను, రెండుస్లారు డీజిల్ ధరను తగ్గించగా, మిగిలిన రోజుల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపారు. త్వరలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో కేంద్రం పెట్రోల్, డీజిల్ ను వస్తు, సేవల పన్ను(జీఎస్ టీ) పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.