మంత్రి హరీష్ రావు పై దుబ్బాక ఎమ్మెల్యే రఘు నందన్ రావు మంది పడ్డారు. ఈటెల రాజేందర్ కాలు ఆపరేషన్ పై  దిగజారి మాట్లాడటాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. హరీశ్ రావు డ్రామాలకు శ్రీకాంతాచారి బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ కొనుక్కున్న హరీశ్ రావు 50 పైసలు పెట్టి అగ్గిపెట్టి కొనుక్కోకపోవడం కూడా డ్రామాలో భాగమేనని అన్నారు. హరీశ్ ది డ్రామా అని తెలియని శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకుని కాల్చుకున్నాడని చెప్పారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎమ్మెల్సీ పదవికి అర్హురాలు కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కౌశిక్ రెడ్డి ది  కీలక పాత్ర అని కేసీఆర్ భావించినట్టున్నారని మండిపడ్డారు. నిరాహార దీక్షకు దిగిన కేసీఆర్ ఖమ్మం ఆస్పత్రిలో జ్యూస్ తాగడం నిజం కాదా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఆసుపత్రిలో జ్యూస్ ఇచ్చిన డాక్టర్ కు కేసీఆర్ గులాబీ కండువా కప్పలేదా? అని నిలదీశారు. 2008లో రాజశేఖర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు హరీశ్ సిద్ధమయ్యారని… అలాంటి హరీశ్ తో చెప్పించుకునే స్థితిలో తాము లేమని అన్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవిని కేసీఆర్ ఇప్పించారా? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెపుతుందని వ్యాఖ్యానించారు. మాదిగ సామాజిక వర్గానికి కేబినెట్ లో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాత్ర, పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్రను వాయిదా వేశామని చెప్పారు.