
కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారనున్నాయి కర్ణాటక సీఎం బి ఎస్ యడియూరప్ప తన పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ పెద్దల తో వరుసగా సమావేశం అవుతున్నారు. తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక విషయాలపై వారు చర్చించారు. కావేరీ జలాల వివాదం మరియు కేరళ- కర్ణాటక మధ్య చోటు చేసుకొంటున్న పరిణామాలపై వారు సుదీర్ఘంగా చర్చ జరిపినట్లు సమాచారం అందుతోంది. అలాగే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సందర్భంలో నే ఆయన తన రాజీనామా ప్రస్తావన తెచ్చినట్లు సమాచారం. ప్రధాని తో భేటీ అనంతరం, కర్నాటక సీఎం యడ్యూరప్ప బిజేపి జాతీయ అధ్యక్షుడు జే.పి. నడ్డా ను కలిసి తాను రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారని, అదే విషయాన్ని మోడి దగ్గర ప్రస్తావించినట్లు అమిత్ షా తో చెప్పినట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యమంత్రిని మార్చేందుకు బిజేపి అగ్ర నాయకత్వం మొగ్గు చూపితే, జులై 26వ తేదీ వరకు ఆ మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.