
టీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక రోజు తన చేతికి వస్తుందని మంత్రి హరీశ్ రావు పగటి కలలు కంటున్నారని, కానీ.. ఆయన చేతికి రాక ముందే ఆ పార్టీ ఖతమైపోతుందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఆ పార్టీని చేజిక్కించుకోవాలని హరీశ్ రావు ఎప్పటి నుంచో పథకాలు రచిస్తున్నాడని, ఏదో ఒకరోజు టీఆర్ఎస్ పార్టీని క్యాప్చర్ చేయకపోతానా? దానికి యజమాని కాకపోతానా? అని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈటల విలేకరులతో మాట్లాడారు.
‘‘నేను హుజూరాబాద్ నియోజకవర్గానికి 3,950 డబుల్ బెడ్ రూం ఇళ్లు తెచ్చుకున్నాను. జమ్మికుంట, హుజూరాబాద్, కమలాపూర్ తదితర ప్రాంతాల్లో అవి చివరి దశలో ఉన్నాయి. నిర్మాణ వ్యయం భారమైపోవడంతో.. అవి ముందుకు కదల్లేదు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన కాంట్రాక్టర్లు మాత్రమే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించారు. 2018లో హుజూరాబాద్ నియోజకవర్గంలో 50 మహిళా సంఘాల భవనాల నిర్మాణాలకు, జమ్మికుంట, హుజూరాబాద్ ప్రాంతాల అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేశాను. కానీ, ఆ నిధులు విడుదల కాకుండా మంత్రి కేటీఆర్ అడ్డుపడ్డారు…’’ అని ఈటల ఆరోపించారు. మామ దగ్గర మార్కులు తెచ్చుకోవాలంటే.. వేరే మార్గాలు వెతుక్కోవాలి గానీ.. తనపై అసత్య ప్రచారాలు చేస్తే అభాసుపాలు కాక తప్పదని హరీశ్ రావును హెచ్చరించారు. చిల్లర రాజకీయాలు చేసి పలుచన కావద్దని సూచించారు.
‘‘హరీశ్ రావుతో నాకు బలమైన అనుబంధం ఉంది. మా పరిచయం ఇప్పటిది కాదు. 18 ఏళ్లుగా కలిసే ఉన్నాం. నా విషయాలన్నీ ఆయనకు తెలుసు. ఆయన వ్యవహారాలన్నీ నాకు తెలుసు. ఇప్పుడు హరీశ్ రావు కొత్తగా ఇక్కడకు వచ్చి అబద్ధాలు చెప్పి, మొసలి కన్నీరు కారిస్తే నమ్మేవాళ్లెవరూ లేరు..’’ అని ఈటల అన్నారు. నన్ను ఓడించేందుకు 2018లో నా ప్రత్యర్థికి డబ్బులు పంపించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అవుతున్నది వాస్తవం కాదా? చెప్పాలని ఈటల ప్రశ్నించారు. తన ఆస్తులతో పాటు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఈటల డిమాండ్ చేశారు. 2003 నుంచి 2021 వరకు ఆస్తుల లెక్కలు బయటకు తీస్తే ఎవరి అక్రమ సంపాదన ఎంతో తెలుస్తుందన్నారు. ఇక్కడ తన ఓటమి కోసం కేసీఆర్ చేయని తప్పు లేదని, ఇప్పటికే 192 కోట్లు ఖర్చుచేశారని చెప్పారు. రూ.వేల కోట్ల పథకాలు ఇచ్చినప్పటికీ.. కేసీఆర్ చేసుకున్న సర్వేలోనే టీఆర్ఎస్ కు 22 శాతానికి మించి ఓట్లు రావడం లేదన్నారు. తెలంగాణ ఖజానా ఖాళీ చిప్పని తనకు బాగా తెలుసన్నారు. ప్రగతి భవన్ మొత్తాన్ని మందు గోలీలు ఇచ్చే ఎంపీ కంట్రోల్ చేస్తున్నారని, అది బానిసలకు నిలయంగా మారిందని ఎద్దేవా చేశారు. అదే ప్రగతి భవన్ లో అవమానాలు ఎదురైనప్పుడు తాను, హరీశ్, జగదీశ్ ఏడ్చామని చెప్పారు.