
‘‘జగన్.. అధికారం కోసం ఊరూరా తిరిగావ్. ఫ్యాను గిర్రున తిప్పావ్. ఒక్క చాన్స్ అన్నావ్. అధికారం వస్తే ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావ్. తీరా అధికారం వచ్చాక.. ఓ ఫేక్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశావ్. నువ్వో ఫేక్ సీఎం అని నిరూపించుకున్నావ్…’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఉద్యోగాలు ఇవ్వడం చేతకాక.. ఓ సీఎంగా ఫెయిలైన జగన్.. ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను కనీసం పరామర్శించకుండా ఓ మనిషిగా కూడా ఫెయిలయ్యాడని తీవ్రంగా విమర్శించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నెల్లూరుకు చెందిన నిరుద్యోగి కమల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం సాయంత్రం లోకేశ్.. నగరానికి వచ్చారు. అయితే, కమల్ కుటుంబం ఉంటున్న ఇంటికి తాళం వేసిఉండడంతో.. ఇంటి బయటే కమల్ చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన లోకేశ్.. జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.
‘‘కమల్ కటుంబాన్ని పరామర్శించడానికి నేను వస్తున్నాననే సమాచారం తెలియడంతో ఆ కుటుంబ సభ్యులను బెదిరించి అదృశ్యం చేశారు. మొన్న కర్నూలులోనూ ఇదే జరిగింది. అసలు ఈ ముఖ్యమంత్రికి మానవత్వం లేదు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి, భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. వాళ్లు ఆ పని చేయకపోగా.. మమ్మల్నీ పరామర్శకు రానివ్వడం లేదు. ఇక్కడి ఎమ్మెల్యేకి నోరుపారేసుకోవడం మాత్రమే వచ్చు. దేశంలో విషయాలన్నీ అసెంబ్లీలో మాట్లాడతారు గానీ, తన నియోజకవర్గంలో జరిగిన ఆత్మహత్యపై మాత్రం నోరు మెదపరు’’ అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం జగన్.. గిర్రున తిప్పిన ఫ్యానుకే ఇప్పుడు నిరుద్యోగులు ఉరేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘జగన్ రెడ్డి విడుదల చేసిన ఫేక్ క్యాలెండర్ ను రద్దు చేయాలి. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఆత్మహత్య చేసుకున్న ప్రతి నిరుద్యోగి కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించాలి. అంతవరకు తెలుగుదేశం ఉద్యమం ఆగదు’’ అని లోకేశ్ తేల్చి చెప్పారు.