
భారత్ కు బౌలింగ్ కోచ్ గా ఉండేందుకు దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ఆసక్తి కనబరిచాడు. ఓ క్రీడా ఛానల్ చేసిన ఇన్ స్టా పోస్ట్ కు స్టెయిన్ ఇచ్చిన సమాధానం చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. టీ 20 వరల్డ్ కప్ లో టీం ఇండియాకు మెంటారుగా ధోనీని బీసీసీఐ నియమించింది. ఈ క్రమంలో ధోనీతో ఫోన్ మాట్లాడుతుంటే.. అతనికి మీరు ఏం చెబుతారని ఆ ఛానల్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన స్టెయిన్… టీం ఇండియా బౌలింగ్ కోచ్ గా తనను నియమించమని అడుగుతానని అన్నాడు. 93 టెస్టులు ఆడిన స్టెయిన్ 439 వికెట్లు తీశాడు. 125 వన్డేల్లో 196 వికెట్లు పడగొట్టాడు. 47 టీ 20ల్లో 64 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 26 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో మూడుసార్లు ఐదు వికెట్లు తీశాడు.
టీ20 ప్రపంచకప్ అనంతరం భారత జట్టు ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు రవిశాస్త్రి ఇప్పటికే ప్రకటించాడు. మెగా టోర్నీ తర్వాత బౌలింగ్ కోచ్ గా కొనసాగనని భరత్ అరుణ్ కూడా స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో కొత్త కోచింగ్ బృందం కోసం బోర్డు చర్చలు జరుపుతోంది. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కోసం అధికారిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది.
ఈ పదవి కోసం పోటీదారులు తమ దరఖాస్తులను అక్టోబర్ 26 సాయంత్రం 5 గంటలలోపు పంపాలని తెలిపింది. అయితే రాహుల్ ద్రవిడ్ ను కోచ్ గా చేయడానికి బీసీసీఐ నిబంధనల ప్రకారం లాంఛనాలు ప్రారంభమయ్యాయి. ప్రధాన కోచ్ తో పాటు సహాయక సిబ్బందిలో బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ కోసం కూడా దరఖాస్తులను బీసీసీఐ ఆహ్వానించింది.