
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక్కతాటిపై వచ్చిందని సంబరపడి నలభై ఎనిమిది గంటలు కూడా గడవలేదు. లక్షన్నరకు పైగా ఆదివాసీలు, దళితులు హాజరైన దళిత దండోరా గర్జన సభ విజయోత్సాహం నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకా బైట పడలేదు. ఈలోగానే కాంగ్రెస్ పార్టీలో పెద్ద కుదుపు దళిత బంధు రూపంలో వచ్చింది. అదికూడా ఇంద్రవెల్లి సభలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పొగడ్తలతో ఆకాశానికి ఎత్తిన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ రూపంలో కావడం గమనార్హం.
సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం చాలా అద్భుతమైన పథకమని, ఇటువంటి అద్భుతమైన ఆలోచన సీఎం కేసీఆర్‌కు తప్ప ఇప్పటి వరకు మరెవరికీ రాలేదని సర్వే సత్యనారాయణ కొనియాడారు.ఈ పథకం ద్వారా దళితులు తప్పకుండా డెవలప్ అవుతారని జోస్యం చెప్పారు.
అయితే, సీఎం కేసీఆర్‌ను పొగిడితే తనపై విమర్శలు వస్తాయని భయపడ్డారేమో తెలియదు కానీ, వెంటనే తన ప్రశంసలను పార్టీ లైన్‌కు అనుకూలంగా మార్చారు. సీఎం కేసీఆర్ తీసుకు వచ్చిన దళిత బంధు పథకాన్ని మాత్రమే ప్రశంసిస్తున్నాను తప్ప, కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచన తనకు లేదని సర్వే స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని గొప్పగా నడిపిస్తారని, ప్రజల్లోకి పార్టీని తీసుకెళతారని, అధికారంలోకి తీసుకు రాగల సత్తా ఉన్న నాయకుడని కొనియాడారు. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసే అధికారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కేడర్‌కు లేదని, ఆ అధికారం కేవలం సోనియా, రాహుల్ గాంధీలకు మాత్రమే ఉందని అన్నారు. జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, సోనియా పాదాల వద్దనే ప్రాణాలు విడుస్తానని సర్వే ప్రకటించారు.
సర్వే సత్యనారాయణ చేసిన సీఎం కేసీఆర్ అనుకూల ప్రశంసలపై కాంగ్రెస్ పార్టీ నేతలు విస్మయం చెందారు. హుజూరాబాద్ ఎన్నికల కోసం తీసుకు వచ్చిన జిమ్మిక్కు పథకానికి సీనియర్ కాంగ్రెస్ నేత వంత పలకడమా, ప్రశంసించడగమా అని ఆశ్చర్య పోతున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల మాజీ ఇన్చార్జ్ కుంతియాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సర్వే ఆ తర్వాత బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించినా, వర్కవుట్ కాకపోవడంతో కాంగ్రెస్‌లోనే ఉండిపోయారని, టీఆర్ ఎస్‌లోకి వెళ్లాలనే ముందస్తు ఆలోచనతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకంపై ప్రశంసలు కురిపిస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఒక్క తాటిపై నడపడం అసాధ్యమని మరోసారి రుజువైంది.