
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకంపై ప్రభుత్వానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈనెల 16న హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పథకం అమలుకు ఇప్పటికే రూ. 500 కోట్లు మంజూరు చేసింది. నిరుపేద దళితులకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం చేయడానికి లబ్దిదారుల ఎంపిక కూడా పూర్తయింది. రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సైతం హుజూరాబాద్‌లో మకాం వేసి దళితబంధు పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
ఈ సమయంలో హుజూరాబాద్ దళితులు కేసీఆర్ ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చారు. ఈనెల 16వ తేదీ నుంచి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్న దళితబంధు పథకంలో తమ పేర్లు లేవని పెద్దసంఖ్యలో హుజూరాబాద్ దళితులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం రూ. 10 లక్షల ఆర్థిక సాయం దళితులు అందరికీ ఇవ్వడం లేదని, కొంతమందికి మాత్రమే అందిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్దిదారుల జాబితాలో తమ పేర్లు లేవంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. లబ్దిదారుల జాబితాను చింపేశారు. దళితులందరికీ దళితబంధు పథకాన్ని అమలు చేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు. హుజూరాబాద్ పెద్ద పాపయ్యపల్లి క్రాస్ రోడ్, అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద సంఖ్యలో ఎస్సీలు ఆందోళన చేపట్టారు. దళితుల ఆందోళనతో వరంగల్ – కరీంనగర్ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచి పోయాయి.