
దళితబంధు .. పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన క్షణం నుంచి ఆ పథకం అమలయ్యే క్షణాల కోసం తెలంగాణలోని ప్రతి దళిత కుటుంబం కోటి కళ్లతో ఎదురు చూస్తోండగా, ఆ అద్భుత క్షణాలు వాసాలమర్రికి వచ్చేశాయి. దళిత బంధు పథకం క్రింద రూ. 10లక్షలు సొంతమయ్యే గోల్డెన్ చాన్స్ దక్కించుకోవడానికి రాష్ట్రంలోని దళితులందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తుండగా, ఆ పది లక్షల సొమ్ము వాసాలమర్రి గ్రామ దళితులకు గురువారం అందాయి. దీంతో దళితబంధు పథకం అమలైన మొట్టమొదటి గ్రామంగా వాసాలమర్రి రికార్డులకు ఎక్కింది. దీంతో సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. దళితవాడలోని ప్రతి ఇల్లూ సంబరాల్లో మునిగి తేలుతోంది. దళితులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ, ఆనందడోలికల్లో తేలిపోతోంది. ఊరు ఊరంతా సంబరాల్లో మునిగి తేలుతోంది. దళిత బంధువయా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కీర్తిస్తూ డప్పు డోలు కొడుతూ దండోరా వేస్తున్నారు.
వాసాలమర్రి గ్రామంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం ద్వారా గురువారం నిధులు విడుదలయ్యాయి. గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు చొప్పున రూ. 7.60 కోట్లను విడుదల చేయడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఊరు ఊరంతా సంబరాలు చేసుకుంటోంది. డప్పులు వాయిస్తూ, దండోరా వేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి లబ్దిదారులు పాలాభిషేకం చేశారు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్నామని, రెక్కాడితే కానీ, డొక్కాడని తమ జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపాడని దళిత మహిళలు కొనియాడారు. ఊహ తెలిసినప్పటి నుంచి కష్టం చేస్తున్నామని, తాము అనుభవిస్తున్న కష్టాలను చూసి సీఎం కేసీఆర్ చలించి పోయారని, అందుకే, ఇంటికి పది లక్షల రూపాయల రుణం మంజూరు చేశారని వారు అన్నారు. వాసాలమర్రిలోని ప్రతి దళిత కుటుంబమూ సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉందని, దేవుడు మాకు కనిపిస్తాడో లేదో తెలియదు కానీ, కేసీఆర్ మాత్రం దేవుడిలా కనిపిస్తున్నాడని కొనియాడారు. దీంతో సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. సీఎం కేసీఆర్‌ను దళిత బంధువయా అని కొనియాడుతున్నారు. .
రాష్ట్రంలోని దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు (సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్) తిరిగి చెలించాల్సిన అవసరం లేని రూ. 10 లక్షలు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకాన్ని తొలుత పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 16న సమావేశమైన మంత్రిమండలి హుజూరాబాద్‌లో దళితబంధు పైలెట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని తీర్మానించింది. అయితే, సీఎం కేసీఆర్ అనూహ్యంగా బుధవారం తన దత్తత గ్రామంలో పర్యటించారు. జిల్లా కలెక్టర్ సహా ప్రభుత్వ యంత్రాంగమంతా సీఎం కేసీఆర్ వెంట కదిలి వచ్చింది. పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ గ్రామంలోని ప్రతి దళితుడి ఇంటికి వెళ్లారు.వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. 76 దళిత కుటుంబాలున్న వాసాలమర్రిలోనే మొదట దళితబంధు పథకం అమలు చేస్తానని ప్రకటించారు. గురువారం నిధులు విడుదల చేయడం జరుగుతుందని సీఎం కేసీఆర్ గ్రామ దళితులకు హామీనిచ్చారు. ఆ మాటను ముఖ్యమంత్రికేసీఆర్ నిలబెట్టుకున్నారు. దళితబంధు పథకం నిధులను వారికి విడుదల చేశారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.