
మనం నిత్యం వినియోగించే నాణేలు, కరెన్సీ ఎలా తయారు చేస్తారు? ఎలాంటి యంత్రాలు వినియోగిస్తారు? వంటి అంశాలు ఎప్పుడూ ఆసక్తికరమే. అలాంటి యంత్రాలను స్వయంగా చూడగలిగితే.. నిజంగా విశేషమే. త్వరలోనే అలాంటి అవకాశం హైదరాబాద్ వాసులకు దక్కనుంది. హైదరాబాద్ లోని సైఫాబాద్ లో ఉన్న మింట్ లో త్వరలోనే మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు.
నిజాం హయాం నుంచే సైఫాబాద్ మింట్ లో నోట్లు ముద్రిస్తున్నారు. అప్పటి యంత్రాలు కూడా అందులో భద్రంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ భవనంలోనే ‘మింట్ మ్యూజియం’ ఏర్పాటు చేయబోతున్నారు. 1895లో ఆరో నిజాం లండన్ నుంచి ప్రత్యేక యంత్రాలను దిగుమతి చేసుకుని, చర్కి (చర్కా)ల ముద్రణను ఇక్కడ ప్రారంభించారు. పూర్తి స్థాయిలో ఆధునీకరించే ఉద్దేశంతో సైఫాబాద్‌లో ప్రత్యేక భవనాన్ని నిర్మించి 1903లో యూరప్ మింట్ల తరహాలో పూర్తి ఆధునిక పద్ధతుల్లో నాణేలు ముద్రించే కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. 1918లో హైదరాబాద్ కరెన్సీ చట్టాన్ని తెచ్చి.. నోట్ల ముద్రణ కూడా ప్రారంభించారు.
ఈ భవనంలోనే మింట్ మ్యూజియం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్పీఎంసీఐఎల్) ఏర్పాట్లు చేస్తోంది. ‘ఆజాదీ కా అమృతోత్సవ్’లో భాగంగా వచ్చేనెల రెండో వారంలో ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. తర్వాత దాన్ని మ్యూజియంగా మార్చే పని ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇక్కడి పురాతన యంత్రాలను పునరుద్ధరించే కసరత్తు మొదలుపెట్టారు. వందేళ్లకు పైబడి కరెన్సీని ముద్రించిన మింట్‌ను మ్యూజియంగా మార్చుతుండటం దేశంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.