
సీబీఐ దూకుడుతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వివేకా హత్య కేసులో క్షేత్ర స్థాయి నుంచి పక్కా ఆధారాలు సేకరించుకుంటూ వస్తోన్న సీబీఐ అధికారులు.. ఇప్పుడు కీలక నేతలపై దృష్టి పెడుతున్నారు. బుధవారం బృందాలుగా విడిపోయి తనిఖీలు జరపడంతో పాటు.. కొందరు వైసీపీ నేతలను ప్రశ్నించారు. కర్ణాటక నుంచి ప్రత్యేకంగా వచ్చిన అధికారుల బృందం కూడా వీరికి జత కలిసింది. ఈ బృందంలో బ్యాంకు అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ కు సమీప బంధువు, వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డిని సీబీఐ అధికారులు.. పులివెందుల ఆర్ అండ్ బీ అతిథిగృహంలో సుమారు రెండున్నర గంటల పాటు ప్రశ్నించారు.
వివేకా హత్య జరిగిన మరుసటి రోజు ఉదయం వైఎస్ అభిషేక్ రెడ్డి కూడా ఘటనాస్థలిలోనే ఉన్నట్లు సమాచారం. దీంతో.. ఆ రోజు ఉదయం ఏం జరిగింది? అన్న కోణంలో ఆయనపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. బాత్ రూంలో ఉన్న వివేకా మృతదేహాన్ని హాల్లోకి తెచ్చింది ఎవరు..? వివేకా తలకు కట్టు కట్టింది ఎవరు..? ఆ సమయంలో అక్కడ డాక్టర్లు ఎవరెవరు ఉన్నారు.. వంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఆయన.. 2019లో జగన్ మామ డాక్టర్ గంగిరెడ్డి ఆస్పత్రిలో పని చేసేవారని స్థానికులు అంటున్నారు.
ఓ బృందం.. అనుమానితులను ప్రశ్నిస్తుండగా.. మరో రెండు బృందాలు.. పులివెందుల, ప్రొద్దుటూరుతో పాటు తేలూరుతుమ్మలపల్లె, సుంకేసుల గ్రామాల్లోని అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించాయి. పులివెందుల భాకరాపురంలోని సునీల్ ఇంట్లో ఇద్దరు సీబీఐ అధికారులు సుమారు మూడు గంటలు సోదా చేశారు. బ్యాంకు పాస్ పుస్తకం, పాత చొక్కా స్వాధీనం చేసుకున్నారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇంట్లో కూడా సోదాలు చేసి ఇంట్లో వినియోగించే ఐదు కత్తులు, బ్యాంకు పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. పులివెందుల భయ్యమ్మతోట, తొండూరు మండలం తేలూరుతుమ్మలపల్లె గ్రామాల్లోని ఎర్రగంగిరెడ్డి ఇళ్లల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సింహాద్రిపురం మండలం సుంకేసులలో ఉమాశంకర్ రెడ్డి ఇంట్లోనూ.. ప్రొద్దుటూరులో ఉంటున్న ఆయన సోదరుడు జగదీశ్వరరెడ్డి ఇళ్లలోనూ సోదాలు చేసి.. కొన్ని కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తనిఖీల అనంతరం దస్తగిరి, ఎర్రగంగిరెడ్డిలను సీబీఐ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి బుధవారం సీబీఐ అధికారులను కలిశారు. గంట పాటు మాట్లాడారు. వివేకా హత్య కేసు కీలక దశకు చేరుకున్న తరుణంలో.. వారు సీబీఐ అధికారులను కలవడం విశేషం.
‘‘వివేకాను చంపిందెవరో అందరికీ తెలుసు. సింహాన్ని చిట్టెలుక చంపలేదు. సింహం మాత్రమే చంపగలదు. వివేకా.. సింహం లాంటోడు. ఆయన్ని చంపడం మా వల్ల ఎలా అవుతుంది. ఆయన్ను చంపింది ఎవరో.. అందరికీ తెలుసు. సీబీఐ అధికారుల తీరు చూస్తుంటే.. ఈ కేసులో మమ్మల్ని ఇరికిస్తారేమోనని భయంగా ఉంది…’’ అని సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించడం కూడా గమనార్హం.