
ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచారు. దత్తత గ్రామం వాసాలమర్రిలో రెండోసారి పర్యటించిన సీఎం కేసీఆర్‌లో అడుగు అడుగున స్పష్టమైన మార్పు కనబడింది. గ్రామంలోని అరవై మంది దళితుల ఇళ్లకు సీఎం స్వయంగా వెళ్లి పరామర్శించారు. రేషన్‌కార్డులు, పించన్లు, రైతు బంధు వంటి పథకాలు వారికి అందిందీ, లేనిదీ తెలుసుకున్నారు. అర్హులైన వారికి వెంటనే పించన్లు, రేషన్‌కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు అక్కడే ఆదేశాలు జారీ చేశారు. అంతేనా … దళిత జనోద్ధరణ కోసం కొత్తగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకాన్ని వాసాలమర్రి గ్రామంలో గురువారమే అమలు చేయాలని ఆదేశించారు. గ్రామంలోని దళిత కుటుంబాలకు రూ. 10 లక్షలు మంజూరు చేయాలని ఆదేశించి మా మంచి ముఖ్యమంత్రి అంటూ వారితో జేజేలు అందుకున్నారు. హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని భావించిన దళిత బంధు పథకం అనూహ్యంగా వాసాలమర్రి నుంచి ప్రారంభం కానుండడంతో .. ప్రతిపక్షాలు సైతం పాలుపోని స్థితిలో పడ్డాయి.
ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తర్వాత సీఎం కేసీఆర్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడేళ్లు అయినా ఆయన ఎక్కువగా ప్రజల్లోకి రాలేదు. ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు అందుబాటులో లేరు. అధికారిక భవనం ప్రగతి భవన్, సచివాలయాల్లో ఎక్కడా సీఎం కేసీఆర్ దర్శనం లభించేది కాదు. ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలోనే ముఖ్యమంత్రి మకాం ఉండేది. ఫాంహౌస్‌లోని వ్యవసాయ క్షేత్రంలో నచ్చిన పంటలు పండిస్తూ వ్యవసాయ పనులతో బిజీబిజీగా గడిపేవారు. హైదరాబాద్‌లో పనులన్నీ మంత్రి కేటీఆర్, అధికారులు చక్కబెట్టేవారు. సీఎంతో అత్యవసర పని ఏర్పడినా, ఆయనకు అత్యంత సన్నిహితులైన కొద్ది మందికి మాత్రమే ఫాంహౌస్‌లో ముఖ్యమంత్రితో అపాయింట్ మెంట్ దక్కేది. సీఎం కేసీఆర్ వ్యవహారశైలిపై కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండి పడేవారు. కేసీఆర్‌పై ఫాంహౌస్ సీఎం అంటూ పదునైన విమర్శలతో విరుచుకు పడేవారు. కానీ, సీఎం కేసీఆర్‌లో నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం తర్వాత తెలంగాణ ప్రజలు స్పష్టమైన మార్పును గమనిస్తున్నారు. సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన ఫాంహౌస్‌లోనే ఐసోలేషన్‌లో ఉండి పోయారు. కరోనా బారి నుంచి కోలుకున్న తర్వాత సీఎం కేసీఆర్ లో కొత్త ముఖ్యమంత్రి కనిపిస్తున్నాడు. అసైన్డ్‌భూముల వ్యవహారంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేయడంతో ఆ శాఖను సీఎం కేసీఆర్ పర్యవేక్షించడం ప్రారంభించారు.
కరోనా ఫస్ట్‌వేవ్ సమయంలో వైరస్‌ను నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు తీవ్రంగా అభాసుపాలయ్యాయి. కరోనా వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ, ప్రాణాలు నిలబెట్టాలని కోరుతూ బాధితులు తీసిన సెల్ఫీ వీడియోలు ప్రభుత్వ ప్రతిష్ణను దిగజార్చాయి. ప్రైవేట్ ఆస్పత్రుల ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ లేక పోవడంతో లక్షల రూపాయల ఫీజులు కట్టలేక కరోనా రోగులు ఆస్తులు అమ్ముకున్న వైనం రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తుంది. కానీ, కరోనా వైరస్ సెకండ్ వేవ్ సమయంలో వైద్యారోగ్యశాఖ సీఎం కేసీఆర్ నియంత్రణలో ఉండడంతో ఫస్ట్‌వేవ్‌తో పోలిస్తే కాస్త మెరుగు పడ్డాయి. పైగా సీఎం కేసీఆర్ స్వయంగా కరోనా ఆస్పత్రులను సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను పరామర్శించిన తొలి సీఎంగా కేసీఆర్ పేరు మార్మోగింది.కరోనా ఆస్పత్రుల పర్యటన నుంచి సీఎం కేసీఆర్‌లో దూకుడు పెరిగింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాల్లో భాగంగా కేసీఆర్ స్టయిల్ కూడా మార్చారు. ప్రజలతో మమేకం అయ్యేలా ప్రసంగిస్తున్నారు. దత్తత గ్రామం వాసాలమర్రిలో ప్రత్యేక సభను ఏర్పాటు చేసి గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. గ్రామస్తులతో మాట్లాడుతూ, వారికి స్వయంగా వడ్డించి రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యచకితులను చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామ వాసాలమర్రిలో బుధవారం మరోసారి పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వైఖరి సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీల వారిని కూడా విస్మయ పరిచింది. గ్రామంలోని దళిత కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించారు. కాలికి బలపం కట్టుకుని వరుసగా అరవై ఇళ్లను సీఎం కేసీఆర్ సందర్శించారు. ప్రతి ఒక్క కుటుంబాన్నీ పలకరించి వారి స్థితిగతులు, కష్ట సుఖాలు పరామర్శించారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకంపై వారిని ఆరా తీశారు. పథకం కింద రూ. 10 లక్షలు మంజూరయితే, ఏం చేస్తారని ఆయన దళితులను ప్రశ్నించారు. డెయిరీ ఫాం, కుట్టు మిషన్లు వంటి కుటీర పరిశ్రమలు పెట్టుకుని జీవితంలో స్థిర పడతామని దళితులు సీఎం కేసీఆర్‌కు వెల్లడించారు. దీంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకంపై కీలక ప్రకటన చేశారు. వాసాల మర్రి గ్రామ దళితులకు దళిత బంధు పథకాన్ని గురువారం నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ రైతు వేదికపై గ్రామ రైతులతో సమావేశమయ్యారు. రైతుబంధు పథకం గురించి వారిని ఆరా తీశారు. దీంతో గ్రామస్థులు సీఎం కేసీఆర్‌ను మా మంచి ముఖ్యమంత్రి అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.