
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ‘ఆచార్య’ , కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. కొన్ని రోజుల క్రితం ఆయన సంగీతం సమకూర్చిన ‘లాహే లాహే .. ‘ పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. శివపార్వతుల మధ్య వున్న బంధాన్ని, వారి విరహాన్ని గురించి ప్రస్తావిస్తూ రామజోగయ్య శాస్త్రి రాసిన “కొండల రాజు .. మంగళగౌరి” అంటూ జానపద బాణీలో సాగే పాట ఇది. మణిశర్మ బీట్ ఈ పాటకు పట్టం కట్టిందనే చెప్పాలి. సాహిత్య పరంగా పాటను మొదలుపెట్టిన తీరు .. ముగింపు ఇచ్చిన విధానం రామజోగయ్య శాస్త్రి ప్రతిభకు అద్దం పడుతుంది. తేలికైన లోతైన భావాలను ఆయన ఆవిష్కరించారు.
ఈ పాటను యూ ట్యూబ్ లో ఇలా వదలగానే అలా దూసుకుపోయింది. ఈ మధ్యకాలంలో జానపద బాణీలో అలరించిన పాటల్లో ముందువరుసలో నిలిచింది. ఇంతవరకూ ఈ పాట 80 మిలియన్ల వ్యూస్ ను రాబట్టడం విశేషం. ఇది నిజంగా ఒక రికార్డు అని చెబుతున్నారు. ‘ఆచార్య’ నుంచి ఈ పాట ఇలా తొలి రికార్డును నమోదు చేసిందని చెబుతున్నారు. చిరంజీవి పుట్టినరోజైన ఈ నెల 22వ తేదీన, ఈ సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.