
దీపావళి.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోకి నూతన వెలుగులు తీసుకొచ్చే మహత్తర పండుగ. అందరి ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినం. మతంతో సంబంధం లేకుండా చాలా వరకు అందరూ కలిసి ఆనందోత్సాహాలతో దీపావళి జరుపుకుంటారు. దీపావళి అంటేనే సరదాలు, సంబరాలు, దీపాల వెలుగులు, బాణసంచాల జిలుగులు, కుటుంబం అంతా కలిసి జరుపుకునే వేడుకలు. దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగ. అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, దీపాలను వెలిగించి, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించే పండుగ దీపావళి. ఇది భారతదేశం అంతటా జరుపుకునే ఒక పండుగ.
ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు ఈ పర్వదినం వస్తుంది. ఈ ఏడాది నవంబర్ 1న గోవత్స ద్వాదశి.. మరుసటి రోజు ధన త్రయోదశి కావున నవంబర్ 4న దీపావళి జరుపుకోనున్నారు. అమావాస్య తిథి నవంబర్ 4వ తేదీ ఉదయం 6:03 గంటలకు ప్రారంభమై నవంబర్ 5వ తేదీ తెల్లవారుజామున 2:44 గంటల వరకు కొనసాగుతుంది. నవంబర్ 4వ తేదీ సాయంత్రం 6:09 నుండి రాత్రి 8:20 గంటల వరకు లక్ష్మీపూజ, గణేశ పూజ నిర్వహించడానికి తగిన సమయమని పండితులు చెబుతున్నారు. దృక్ పంచాంగ్ ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత దీపావళి పూజ ప్రదోష కాలంలోనే నిర్వహిస్తారు. ఆ సమయంలో పూజ చేస్తేనే శుభాలు కలుగుతాయని పంచాంగం చెబుతోంది. నవంబర్ 4న సాయంత్రం 5:34 నుండి రాత్రి 8:10 గంటల వరకు ప్రదోష కాల అమలులో ఉంటుంది. అయితే అసలు ఈ పండుగ విశిష్టత ఏంటి? పౌరాణిక చరిత్ర ఉందా? లాంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ గ్రంధాల ప్రకారం, లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సు, సంతానోత్పత్తికి ప్రతీక. అందుకే కచ్చితంగా ప్రతి ఒక్కరూ లక్ష్మీ పూజలు విశేషంగా చేస్తారు. ఆ లక్ష్మీదేవిని అందరూ తమ గృహాలకు ఆహ్వానిస్తారు. బెంగాలీలు ఈ సమయంలో కాళీ దేవిని పూజిస్తారు. భారతదేశంలోని చాలా గృహాల్లో దీపావళి సమయంలో కూడా గణేశుడిని పూజిస్తారు. ఈ పండుగ జరుపుకోవడానికి అనేక కారణాలున్నాయి. భూదేవి, వరాహ స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు.. శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టిపీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు. నరకాసుర సంహారంతో అందరూ అనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడు మరణించగా, ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు.
దీపావళి పండుగ నాడు ఇళ్లను పూల మాలలు, రంగోలీలు, దీపాలతో అలంకరిస్తారు. లడ్డూలు తప్పనిసరిగా చేస్తారు. ఈ రోజున వ్యాపారులు తమ ఖాతా పుస్తకాలను మార్చుకుంటారు. దీపావళి సందర్భంగా అపమృత్యు దోషం లేకుండా ఉండటం కోసం దీపావళి రోజు రాత్రి లక్ష్మీ పూజ నిర్వహిస్తారు. అకాల మృత్యు దోషాలు తొలగి పోవడానికి పెద్ద ఎత్తున పూజలు చేస్తారు.
సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి, వెలిగించి, గుమ్మాల్లో నేల మీద కొడుతూ… ‘దిబ్బి దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగులచవితి, పుట్ట మీద జొన్నకర్ర, పుటుక్కు దెబ్బ! అని పాడతారు. గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోటవేసి, వెనక్కి తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కుని లోపలికి వెళ్లి శుభానికి మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం. తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మీ దేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈ రోజు చేస్తే ధన ధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి.