
ప్రస్తుతం తెలంగాణాలో కరోనా కన్నా హాట్ టాపిక్ ఏంటంటే హుజురాబాద్ ఉప ఎన్నిక. ఈ ఎన్నికల ఖర్చే 700 కోట్లు అంటే ఈ ఎన్నిక తెలంగాణ లోని అన్ని ప్రధాన పార్టీలకు ఎంత ప్రతిష్టాత్మకమో వేరే చెప్పాల్సిన పని లేదు. ఈ ఉప ఎన్నికలపై ప్రధాన పార్టీలు తమ తమ పంథా మార్చుకుంటున్నాయి. ఈ ఎలక్షన్ లో గెలవడానికి విధి విధానాలు రూపొందించుకుంటున్నాయి. ఈటెల రాజేందర్ రాజీనామాతో ఇటు తెరాస, అటు బీజేపీ, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అనేలా ముందుకు సాగనున్నాయి. ఈ క్రమంలోనే ఈటెలను ఎదుర్కొనేందుకు అధికార పార్టీ తెరాస కొత్త కొత్త పథకాలు ప్రవేశపెడుతుంది. ఆచరణకు సాధ్యం కాని హామీలు గుప్పిస్తూ ఓటర్లను ప్రభావితం చేసే పనిలో పడింది.
కెసిఆర్ చెప్పినట్లు దళిత బంధు పేరుతో హుజురాబాద్ నియోగకవర్గంలోని ఒక్కో దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ అది ఆచరణ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. రెండేళ్లలో జరిగే శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుందనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి
ఓటర్ జనాభా లెక్కల ప్రకారం హుజురాబాద్ లో రెండు లక్షల ఇరవై ఆరు వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 45 వేల మంది ఎస్సీ ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేయగల సంఖ్యలో ఎస్సీలు ఉండడంతో ప్రభుత్వం ఇక్కడి నుంచి దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టినట్టు భావిస్తున్నారు. బీసీ సామాజిక వర్గంలో పద్మశాలి ఓట్లు 26 వేలు ఉన్నాయి. అలాగే కాపు సామాజికవర్గం ఓట్లు కూడా దాదాపు 26 వేల వరకు ఉంటాయి. దీంతో టీఆర్ఎస్ ఇక్కడ విజయం సాధించాలంటే దళితుల ఓట్లే కీలకమని భావించి వారిపై ఎక్కడ లేని ప్రేమ ఒలకబొస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే మాట్లాడిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ దళితులకు మూడెకరాల భూమి, దళితుడిని సీఎం తదితర హామీలిచ్చినా కూడా ఇంతవరకు వాటి జోలికి పోలేదు. ఎక్కడ కూడా ఒక్క సెంటు భూమి కూడా దళితులకు ఇవ్వలేదు. ఇప్పుడు దళితబంధు పేరుతో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శలు చేశారు. దళితబందుపై టీఆర్ఎస్ పార్టీ భారీగానే ఆశలు పెట్టుకుంది. ఇన్ని వేల కోట్లు వెచ్చించి వారికి లబ్ధి చేకూర్చేందుకు సంకల్పించినా ఆచరణ మాత్రం కష్టమే. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తే ఎన్ని వేల కోట్లు కావాలి? ఎక్కడి నుంచి తెస్తుంది? అనే అనుమానాలు సైతం వస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాలకు కూడా ఓ మంచి టాపిక్ దొరికట్లయింది. దీంతో టీఆర్ఎస్ ఇరుకున పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి