
టీపీసీసీ చీఫ్ పదవి రేవంత్‌రెడ్డి కి ఇవ్వడం పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇకపై తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవు తానని ప్రకటించారు. టీపీసీసీ కొత్త టీమ్‌ను టార్గెట్ చేస్తున్న ఎంపీ కోమటిరెడ్డి.. తాజాగా తన నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టడానికి సిద్ధమయ్యారు. యాదాద్రి జిల్లాలోని గందమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి త్వరలోనే పాదయాత్ర చేపడుతానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. గందమల్ల రిజర్వాయర్ ఎత్తేస్తే ఆలేరు ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయం తెలిసినా కూడా ఎమ్మెల్యే గొంగిడి సునీత చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేయడం మానుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ చాలాసార్లు యాదాద్రికి వచ్చారని.. కానీ ఒక్కసారి కూడా యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీ స్థితిగతులను పట్టించుకోవడం లేదని కోమటిరెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కేవలం గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట మున్సిపాలిటీ ప్రజలు మాత్రమే పన్నులు కడుతున్నారా.? ఇక్కడి ప్రజలు పన్నులు కట్టడం లేదా..? అని ప్రశ్నించారు. ఈ మూడు నియోజకవర్గాలకే ముఖ్యమంత్రిలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి గా రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూడాలని సూచించారు. కేవలం రైతు వేదికలు, స్మశానవాటికలు ప్రారంభించడానికి తమ ను పిలుస్తున్నారని అన్నారు. గ్రామానికి 400 ఇళ్లు కట్టి పిలిస్తే దానికి ఒక అర్థం ఉంటుందని తెలిపారు. డిగ్రీలు చదివిన విద్యార్థులు ఉపాధి హామీ కూలికి పోవాలంటూ సూచించిన పనికిమాలిన వాళ్లను సీఎం కేసీఆర్ తమ మంత్రులుగా పెట్టుకున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ మెడలు వంచైనా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయిస్తామని ప్రకటించారు.