
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వీడ్కోలుకు రంగం సిద్ధమవుతోందా? ఆయన్ని తక్షణమే పదవి నుంచి తప్పించాలని అధిష్ఠానం భావిస్తోందా? కన్నా లక్ష్మీనారాయణకే తిరిగి పగ్గాలు అప్పగించాలనే అభిప్రాయానికి వచ్చిందా? రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. అలాగే అనిపిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పనితీరుపై అధిష్ఠానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు బాధ్యతలు అప్పగించి ఏడాది దాటినా.. పార్టీ ఏమాత్రం పుంజుకోక పోగా.. నానాటికీ తీసికట్టులా తయారవుతోందని అధిష్ఠానం భావిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ.. ఆర్థిక నేరాలు, రాజకీయ అణచివేతలకు పాల్పడుతున్నా.. పార్టీ పరంగా ఎలాంటి పోరాటమూ జరగడం లేదని అభిప్రాయపడుతోంది. దీన్ని పూర్తిగా వీర్రాజు వైఫల్యంగానే భావిస్తోంది. దీంతో.. ఆయనకు ఉద్వాసన పలికి, కన్నా పట్టాభిషేకానికి రంగం సిద్ధమవుతోందని, ఈ ప్రకటన కూడా మరో రెండు, మూడు రోజుల్లోనే వెలువడ వచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
కన్నా లక్ష్మీనారాయణ రెండేళ్ల పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. రాష్ట్రంలో బీజేపీని ఉనికిలోకి తేవడంలో కొంతవరకు కన్నా సఫలమయ్యారని అధిష్ఠానం భావిస్తోంది. ఆయన అమరావతి రైతుల పక్షాన నిలబడి పోరాడారని, రాజధానిగా అమరావతినే కొనసాగిస్తూ.. భూములిచ్చిన రైతులకు మేలు జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని పార్టీ నాయకుల అభిప్రాయం. ఆయన కారణంగానే రాజధాని రైతుల్లో బీజేపీ పట్ల సానుకూల స్పందన కనిపించిందని వారు అంటున్నారు. అధికార పార్టీ నేతల అవినీతి, అరాచకాలపై విమర్శలతో విరుచుకుపడేవారని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ కేడర్ ను ఉత్తేజితం చేశారన్న అభిప్రాయం ఉంది. అయితే.. చంద్రబాబుతో ఆయనకు సాన్నిహిత్యం ఉందని కొందరు వైసీపీ నేతలతో పాటు బీజేపీ నేతలు కూడా ఆరోపణలు చేశారు. ఇదే ఆయన్ను పదవి నుంచి తప్పించడానికి కారణమైంది.
మరోవైపు వీర్రాజు పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది దాటినా.. ఆయన సాధించింది ఏమీ లేదంటున్నారు పార్టీ నేతలు. కనీసం పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు. జగన్ సర్కారుపై పోరాటం మాట దేవుడెరుగు.. కనీసం సొంత పార్టీ బలోపేతానికి కూడా ఆయన ప్రయత్నం చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. తన దూకుడుతో.. పార్టీని నిలబెట్టారు. అధికార టీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ప్రధాన ప్రత్యర్థిగా మార్చారు. ఆయనతో పోల్చినప్పుడు.. సోము వీర్రాజు పనితీరు తేలిపోతోంది. కార్యకర్తలను ప్రోత్సహించే మాట అటుంచితే.. పనిచేసే వారిని పూర్తిగా అణచివేశారన్న విమర్శలు ఉన్నాయి.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన జట్టుకట్టినా పార్టీ అభ్యర్థికి డిపాజిట్ దక్కకపోవడం అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం.. వీర్రాజుపై వేటుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇది తెలియడంతో ఆయన ఇటీవలి కాలంలో పదేపదే ఢిల్లీ వెళ్తూ హడావుడి చేస్తున్నారని.. కానీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన్ను కలిసేందుకు సమయమివ్వడానికి ససేమిరా అనడంతో రెండుసార్లు ఉసూరుమంటూ తిరిగొచ్చారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. మరో రెండు మూడు రోజుల్లోనే వీర్రాజుపై వేటు, కన్నా నియామకం ఖాయమని, ఒకవేళ రాయలసీమకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే మాత్రం.. ఆదినారాయణ రెడ్డి వైపు మొగ్గు చూపించవచ్చని ప్రచారం జరుగుతోంది.