
పరిపాలనకు అద్దంపట్టేలా.. తెలంగాణ గౌరవం చాటి చెప్పేలా నూతన సచివాలయం ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. త్వరగా పనులు పూర్తిచేయాలని ఏజెన్సీ ప్రతినిధులు, అధికారులను ఆదేశించారు. సచివాలయం చుట్టూ కాలినడకన తిరిగిన ముఖ్యమంత్రి నిర్మాణ పనులను, నాణ్యతను పరిశీలించారు. ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు ప్రముఖుల కోసం నిర్మిస్తున్న వెయిటింగ్ హాల్ నిర్మాణాల తీరు, సందర్శకులు కూర్చునే ప్రదేశాలను పరిశీలించారు. కార్లు, ద్విచక్ర వాహనాలు, బస్సులు నిలిపి ఉంచే స్థలాలు పరిశీలించారు. హెలీపాడ్ నిర్మాణం గురించి అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, సందర్శకులు, సచివాలయానికి వచ్చే ప్రముఖుల కోసం తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలను సీఎం కేసీఆర్ వివరించారు. ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర సిబ్బంది, సాధారణ పరిపాలన అధికారుల కార్యాలయాల నిర్మాణ వివరాలను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. సచివాలయం ముందు, చుట్టుపక్కల నుంచి వర్షపు నీరు వెళ్లేందుకు అనువుగా వరదనీటి డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని సీఎం ఆదేశించారు. విశాలమైన పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా, ఎక్కడికక్కడ నీరు తరలి పోయేలా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం జరగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విశాలంగా నిర్మిస్తున్న కారిడార్ ప్రాంతాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనుకున్న సమయంలో పే సచివాలయ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులకు కు స్పష్టం చేశారు.