
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఆరు విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావించగా కేవలం మూడింటికి మాత్రమే అనుమతి లభించింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో శంషాబాద్ ఎయిర్ పోర్టు మాత్రమే ఏకైక విమానాశ్రయంగా మారింది. దీంతో, రాష్ట్రంలో కొత్తగా ఆరు విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. కానీ కేంద్రం అందుకు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఎయిర్ పోర్టుల టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ తుది రిపోర్టుల ప్రకారం ఆరింటిలో మూడు మాత్రమే పూర్తిస్థాయి ఎయిర్ పోర్టుల నిర్మాణం, పెద్ద విమానాల రాకపోకలకు అనుకూలమని, మరో మూడు అందుకు అనుకూలంగా లేవని ఎయిర్‌పోర్టుల అథారిటీ నివేదిక ఇచ్చింది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, విమాన రాకపోకల సాధ్యాసాధ్యాలు, వాటి వల్ల లాభనష్టాలను భారత విమానయాన సంస్థ అంచనా వేసింది. తెలంగాణలో కేవలం మూడు చోట్ల మాత్రమే విమానాశ్రయాలకు అనుకూలంగా ఉన్నాయని ఎయిర్ పోర్టుల అథారిటీ పేర్కొంది. వరంగల్‌లోని మామూనూర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లోని జక్రాన్ పల్లిలు మాత్రమే పూర్తిస్థాయి విమానాశ్రయాలకు అనుకూలంగా ఉన్నాయని నివేదికలో పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్‌నగర్ లోని దేవరకద్ర, పెద్దపల్లి లోని బసంత్ నగర్లు ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు, పెద్ద విమాన రాకపోకలకు అంతగా అనుకూలంగా లేవని వ్యాఖ్యానించింది.