
ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన విజయగర్జన సభను టీఆర్ఎస్ వాయిదా వేసింది. అంతేకాదు సభ పేరును కూడా మార్చేసింది. ఈ సభ కోసం గత నెల రోజులుగా ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. పార్టీ ద్విదశాబ్ది వేడుకల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో నవంబరు 15న వరంగల్ లో భారీ సభ నిర్వహిస్తామని ప్లీనరీకి ముందే కేటీఆర్ ప్రకటించారు. అప్పుడే వరంగల్ జిల్లాకు చెందిన నేతలకు ఏర్పాట్ల బాధ్యతలు అప్పగించారు. అయితే, ఈ సభను 15వ తేదీన కాకుండా 29వ తేదీన నిర్వహించాలని తాజాగా ఆ పార్టీ నిర్ణయించింది. ‘తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ దీక్ష ప్రారంభించిన రోజును పురస్కరించుకుని 29న దీక్షా దివస్ పేరుతో సభ నిర్వహించనున్నట్లు పేర్కొంది. వరంగల్ జిల్లా నేతల వినతి మేరకే పేరు, తేదీలను మార్పు చేశారని చెప్పుకొంటున్నప్పటికీ అసలు కారణం వేరే ఉందన్న వాదన వినిపిస్తోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఫలితం తారుమారైతే విజయగర్జన పేరుతో సభ నిర్వహించడం అవమానకరంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. పార్టీ అభ్యర్థి ఓడితే శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంటుందని, అలాంటి సమయంలో విజయ గర్జన పేరుతో సభ నిర్వహించడం ఇబ్బందికరంగా ఉంటుందన్న వాదనలతోనే సీఎం కేసీఆర్ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక ఫలితం ప్రభావం వారం, పది రోజుల పాటు ఉంటుందని, ఆ తర్వాత సభ నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో ఏకీభవించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే సభను వాయిదా వేసినట్లు చెబుతున్నారు.