
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడని విషయం తెలిసిందే. ఈ ఎన్నికల బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ప్రకాష్ రాజ్ అయితే తన ప్యానెల్ ను కూడా ప్రకటించుకున్నారు. ‘మా’ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యంగా ప్రకాష్ రాజ్, విష్ణులు చేస్తున్న ప్రకటనలు హీటెక్కిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ చేసిన ఓ ట్వీట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ‘‘తెగే దాకా లొగొద్దు” అంటూ ప్రకాష్ రాజ్ చేసిన ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి అనేది హాట్ టాపిక్‌గా మారింది.
తెగేదాకా లాక్కండి….#Justasking
— Prakash Raj (@prakashraaj) August 4, 2021
‘‘# justasking’ హ్యాష్ ట్యాగ్ తో తన ట్విట్టర్ ఖాతాలో ఈ వ్యాఖ్యలు చేసిన ఆయన ఎవరినైనా హెచ్చరిస్తున్నారా లేక సూచిస్తున్నారా అనేది ‘మా’ ఎన్నిక పై రగడను రాజేసింది. ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ మాత్రం ఎన్నికలు వాయిదా వేసేందుకు సుముఖత చూపిస్తుండటంతోనే ప్రకాష్‌రాజ్ ఈ పోస్ట్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వారు లేకపోలేదు. సెప్టెంబర్ ‘మా’ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈలోగా, ఎన్ని మార్పులు చేర్పులు జరుగుతాయో, బరిలో నిలిచిన నటుల్లో ఎవరెవరు ఈ తరహా ప్రకటనలు చేస్తారనేది ఆసక్తిదాయకంగా మారింది.