
పవన్ కల్యాణ్ తనయుడు అకీరా చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే రేణూ దేశాయ్ తరచుగా తన పిల్లలకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన కుమారుడు కర్రసాము చేస్తున్న వీడియో షేర్ చేసింది. ఇది వైరల్ అయింది. కరాటే, కుంగ్ ఫూ వంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందిన పవన్ కల్యాణ్ పూణేలో టాపర్ గా పేరు తెచ్చుకున్నాడు.
ఇప్పుడు తండ్రి బాటలోనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అకీరా తాజాగా స్టన్నింగ్ వీడియోతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో చూసిన మెగా అభిమానులు తండ్రి పవన్ కల్యాణ్ లాగానే అకీరా నందన్ భవిష్యత్తులో వెండితెరపై అలరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హీరో కావాలనే ఉద్దేశం అకీరాకి లేదని రేణూ దేశాయ్ వివిధ సందర్భాల్లో వెల్లడించింది.
కరోనా లాక్ డౌన్ సమయంలో అకీరా మ్యూజిక్ నేర్చుకోవడానికి ఓ టీచర్ దగ్గర చేరాడు. ఈ టీచర్ తో తండ్రీ కొడుకులు ఓ ఫొటో దిగారు. దానిని ఆ టీచర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అయింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్… క్రిష్ దర్శకత్వంలో హిస్టారికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’లో నటిస్తున్నాడు. ఇప్పటికి 40 శాతానికి పైగానే సినిమా షూటింగ్ పూర్తయింది. క్రిష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా ‘హరిహర వీరమల్లు’.
ఈ సినిమా కోసం నిర్మాత ఏఎం రత్నం 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాడు. పవన్ కెరీర్ లో కూడా హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. 16వ శతాబ్ధపు కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బందిపోటుగా పవన్ నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ కర్రసాము నేర్చుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు గతంలో వైరల్ అయ్యాయి.