
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘన విజయం అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్‌లోనూ తీవ్ర కలకలం రేపింది. టీపీసీసీ లోని ఒక వర్గం నేతలు ఈటల విజయాన్ని సీక్రెట్‌గా సెలబ్రేట్ చేసుకున్నారనే వార్తలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అంతర్గత చర్చల్లో హల్చల్ చేస్తున్నాయి. ఈటల ఘన విజయంపై ఢిల్లీ కాంగ్రెస్ సీరియస్‌గా ఉంది. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే అనే స్థాయిలో టీ కాంగ్రెస్ శ్రేణులను దూకిస్తున్న రేవంత్ రెడ్డి అనూహ్యంగా హూజూరాబాద్ లో పార్టీని వదిలేయడం హైకమాండ్‌ను సైతం నివ్వెరపరుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్‌లో 60 వేల ఓట్లు సాధించగా, ఈ ఎన్నికల్లో కేవలం మూడు వేల ఓట్లకు పడిపోవడంపై అధిష్టానం ఆగ్రహంగా ఉంది. ప్రధానంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు నూతన కార్యవర్గం, నియోజకవర్గ ఇన్చార్జిలపై కాంగ్రెస్ హై కమాండ్ ఆగ్రహంగా ఉందని సమాచారం.
తెలంగాణ కాంగ్రెస్ లో రాజుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక చిచ్చు రాష్ట్రంలో ఇంకా పూర్తిగా చల్లారలేదు. రావణకాష్టంలా రగులుతూనే ఉంది. అయితే, ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్రాన్ని దాటి ఢిల్లీ చేరింది. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి గల కారణాలపై పార్టీ అధిష్టానం విచారణ ప్రారంభించింది. హుజూరాబాద్ ఎన్నికలకు ఇన్ఛార్జిగా పని చేసిన నేతలను అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్‌లో జరిగిన ఈ సమావేశంలో సైతం రాష్ట్ర నేతలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారని సమాచారం.
ఈ సమావేశానికి హాజరైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క… ఈటల విషయంలో చేసిన వ్యాఖ్యలతో అధిష్టానం సీరియస్ అయింది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్కు రాజీనామా చేసిన వెంటనే ఆయనను పార్టీలో చేర్చుకుందామని ప్రతిపాదించానని, కానీ కొంత మంది నేతలు అందుకు అడ్డుపడ్డారని భట్టి ఆరోపించారు. దీనిపై అధిష్టానం భట్టికి గట్టి ఝలక్ ఇచ్చింది. ఈటలను కాంగ్రెస్‌లో చేర్చుకోనీయకుండా అడ్డుపడింది మీరే కదా అని వేణుగోపాల్ నిలదీయడంతో ఆయన నీళ్లు నమిలాడని, ఒక వర్గం ప్రచారం చేస్తుండగా భట్టి వర్గం ఆ ప్రచారాన్ని ఖండిస్తోంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్, రేవంత్ వర్గాలు కూడా పరస్పర ఆరోపణలు చేసుకున్నాయని వినికిడి.
ఉత్తమ్ వర్గం టీఆర్ఎస్కు అనుకూలంగా పని చేసిందని రేవంత్ వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. హుజూరాబాద్ లో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ తగ్గి పోవడానికి కారణం ఉత్తమ్ వర్గమని కొత్త కార్యవర్గంలోని పొన్నం ప్రభాకర్ కూడా ఆరోపించినట్లు సమాచారం. ఉత్తమ్ వర్గానికి చెందిన కౌశిక్ రెడ్డికి టీఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్సీ పదవి కూడా ఉత్తమ్ ఇప్పించుకున్నాడని పొన్నం ఆరోపించారు. ఈ సమావేశంలో పొన్నం, ఉత్తమ్ వర్గాలు, భట్టి, రేవంత్ వర్గాలు, కోమటిరెడ్డి వర్గాలుగా నేతలు విడిపోయి హుజూరాబాద్ ఓటమిపై అధిష్టానం ముందు వాదనలు వినిపించారు. దీంతో ఈటల గెలుపు ఢిల్లీ కాంగ్రెస్‌లో కూడా కలకలం రేపుతోందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.