
డ్రగ్స్ రవాణా వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేపట్టాలని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు డిమాండ్ చేశారు. గతంలో వచ్చిన కన్సైన్మెంట్లతో కలిపితే ఈ దందా లక్ష కోట్ల రూపాయలపైనే ఉంటుందని, దీనిపై విచారణ చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. ఈ విషయమై ప్రధాని మోదీకి తాను ఇప్పటికే లేఖ రాశానని వివరించారు. ఢిల్లీలోని తన నివాసంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘డ్రగ్స్ వ్యవహారంతో వైసీపీ నేతలకు ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చు. ముఖ్యంగా చైన్నైలో జగన్ కు అతి సమీప బంధువు ప్రమేయమైతే ఇందులో అస్సలు ఉండదని నేను నమ్ముతున్నా. అవకాశం వచ్చింది కాబట్టి ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేయడం సహజం’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇందులో ఎంత పెద్ద వారి హస్తం ఉన్న తప్పకుండా బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపైనా ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పు పట్టారు. రూ.1200కు దొరికిన ట్రాక్టర్ ఇసుక.. ఇప్పుడు రూ.7వేలు పెట్టినా దొరకడం లేదని మండిపడ్డారు. ఏపీ ఇసుక చెన్నై, బెంగళూరుకు సునాయాసంగా తరలిపోతుందని తెలిపారు. ఇసుక విధానంలో ఇసుకలో జగన్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ విమర్శించారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ అత్యంత సహృదయంతో రూ.750కోట్ల మేర బ్యాంకు గ్యారంటీ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.