
భారత్ మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న టీ20 సిరీస్‌ని చేజార్చుకుంది. ఇంగ్లాండ్ తో జరిగిన ఏకైక టెస్టుని డ్రాతో సరిపెట్టిన భారత జట్టు, ఆ తరవాత జరిగిన వన్డే సిరీస్‌ని 1-2తో చేజార్చుకుంది. తాజాగా టీ20 సిరీస్‌ని కూడా 1-2 తేడాతో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌కి సమర్పించుకుంది. కంట్రీ గ్రౌండ్ వేదికగా జరిగిన చివరి నిర్ణయాత్మక టీ20 మ్యాచ్‌లో ఓపెనర్ స్మృతి మంధనా (70: 51 బంతుల్లో 8×4, 2×6) ధనాధన్ హాఫ్ సెంచరీ చేసినా, ఇంగ్లాండ్ చేతిలో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఓటమిచవిచూసింది. ఈ మ్యాచ్‌తో ఇంగ్లాండ్ గడ్డపై భారత మహిళల జట్టు పర్యటన ముగిసింది. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు స్మృతి మంధనా అర్ధశతకం నమోదు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ షెఫాలి వర్మ (0) డకౌటవగా.. హర్లీన్ డియోల్ (6), స్నేహ రాణా (4) నిరాశపరిచారు. కానీ.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (36: 26 బంతుల్లో 5×4, 1×6)తో కలిసి నిలకడగా ఆడిన స్మృతి మంధనా.. భారత్‌కి మెరుగైన స్కోరు అందించింది. చివర్లో రిచా ఘోస్ (20: 13 బంతుల్లో 4×4) కూడా దూకుడుగా ఆడింది.
154 పరుగుల లక్ష్య ఛేదనలో టామీ బౌమాట్ (11: 15 బంతుల్లో 2×4) తక్కువ స్కోరుకే ఔటైనా.. మరో ఓపెనర్ డేనియల్ వాట్ (89: 56 బంతుల్లో 12×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడేసింది. ఆమెకి నాటైల్ సివర్ (42: 36 బంతుల్లో 4×4) చక్కటి సహకారం అందించగా.. 18.4 ఓవర్లలోనే ఇంగ్లాండ్ 154/2తో విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, స్నేహ రాణా చెరో వికెట్ తీశారు.