
టీ20 ప్రపంచకప్ ఆడాలన్నది తన కల అని టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. అయితే, జట్టులో స్థానం పొందలేకపోవడం నిరాశకు గురిచేసిందని పేర్కొన్నాడు. ఏదేమైనా టీమిండియా తరఫున ఆడటం గొప్ప విషయమని, జట్టును గెలిపించడంలో తన పాత్ర పోషించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పాడు. కాగా అక్టోబరు 17 నుంచి ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌నకు బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ఈ హైదరాబాదీకి చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే.
అనుభవజ్ఞులైన పేస్ త్రయం జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌కే సెలక్షన్ కమిటీ ఓటు వేసింది. దీంతో సిరాజ్‌కు నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన సిరాజ్.. జట్టులో స్థానం దక్కకపోవడం బాధించిందన్నాడు. టీ20 వరల్డ్ కప్ ఆడాలనేది నా కల. కానీ, సెలక్షన్ అనేది మన చేతిలో ఉండదు కదా. ఒక్కసారి జట్టులో స్థానం దక్కకనంత మాత్రాన అంతా ముగిసిపోయినట్లు కాదు అని తెలిపాడు.