
దళితబంధు ఈ పథకం కెసిఆర్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుండి తెలంగాణ రాజకీయం అంతా దీని చుట్టే తిరుగుతుంది. ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని తొలుత హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేయనున్నారు. ఎల్లుండి హుజూరాబాద్ సభలో కొందరు లబ్ధిదారులకు కేసీఆర్ చెక్కులను అందించనున్నారు. మరోవైపు హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చారని విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు కొందరికి మాత్రమే కాకుండా దళిత కుటుంబాలన్నింటికీ ఒకేసారి సాయాన్ని అందజేయాలని డిమాండ్ చేస్తూ హూజురాబాద్ లో దళితుల ధర్నాకు దిగారు.
ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దళితబంధును పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే టీఆర్ఎస్ కే నష్టమని అన్నారు. ఈ పథకాన్ని అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఒకే ఏడాదిలో 15 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి