
శ్రీలంక తో జరుగుతున్న రెండో వన్డేలో భారత ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ తన ఆల్ రౌండర్ ఆటతో మ్యాచ్ ని గెలిపించి, భారత్ సిరీస్ గెలిచేలా చేసాడు. తొలుత బంతితో రెండు వికెట్లు పడగొట్టిన దీపక్ చాహర్.. అనంతరం బ్యాటింగ్‌లోనూ ఏడో స్థానంలో వెళ్లి 82 బంతుల్లో 7×4, 1×6 సాయంతో 69 పరుగులు చేసి భారత్ జట్టుని గెలిపించాడు. 276 పరుగుల ఛేదనలో ఒకానొక దశలో 193/7తో నిలిచిన టీమిండియా, చాహర్ జోరుతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే 277/7తో గెలిచింది. దీంతో.. శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ భాగంగా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే , భారత్ సొంతం అయింది. ఈ మ్యాచ్ ని గెలిపించిన టీమిండియా నయా సూపర్ స్టార్ గా దీపక్ చాహర్ అయ్యాడు.
దీపక్ చాహర్ క్రీజులోకి వెళ్లే సమయానికే భారత్ జట్టు 160/6 తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. అయినప్పటికీ.. శ్రీలంక టూర్లో చీఫ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్.. దీపక్ చాహర్‌లో స్ఫూర్తి నింపి మరీ మైదానంలోకి పంపాడట. ఈ విషయాన్ని మ్యాచ్ తర్వాత దీపక్ చాహర్ స్వయంగా వెల్లడించాడు. దీపక్ చాహర్ హాఫ్ సెంచరీ ముగియగానే డ్రెస్సింగ్ రూము నుంచి డగౌట్‌లోకి వచ్చిన రాహుల్ ద్రవిడ్.. దీపక్ చాహర్ తమ్ముడు రాహుల్ చాహర్ వద్దకు వెళ్లి కొన్ని సూచనలు చేసి మళ్లీ వెళ్లిపోయాడు. ఆ సమయంలో డ్రింక్స్ బాయ్‌గా ఉన్న రాహుల్ చాహర్, మైదానంలోకి వెళ్లి ద్రవిడ్ సూచనల్ని దీపక్ చాహర్‌కి వివరిస్తూ కనిపించాడు. ద్రవిడ్ సార్ అన్ని బంతుల్ని ఆడాలని నాకు సూచించారు. భారత్-ఎ జట్టు తరఫున నేను కొన్ని మ్యాచ్‌లు ఆడాను. ఆ నమ్మకంతో నెం.7లో నువ్వు చక్కగా బ్యాటింగ్ చేయగలవు అని చెప్పారు. సార్ నాపై నమ్మకం ఉంచారు. బహుశా రాబోవు మ్యాచ్‌ల్లో నాకు బ్యాటింగ్ అవకాశం పెద్దగా రాకపోవచ్చు అని మ్యాచ్ తర్వాత దీపక్ చాహర్ చెప్పుకొచ్చాడు.