
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ జనాల్లో కాకుండా క్యాంప్ ఆఫీసుకు మాత్రమే పరిమితమయ్యారనే విమర్శలు ప్రతిపక్ష పార్టీల నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలో తాను కూడా రచ్చబండకు సిద్ధమయ్యారు. తమ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుపై స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకోవాలని జగన్ భావిస్తున్నారు. గ్రామ సచివాలయాలకు వెళ్లి అక్కడ ప్రజలతో సమావేశం కావాలని భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, ఆచరణలో ఎదురవుతున్న సమస్యలు, సచివాలయ సిబ్బంది పనితీరుపై స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. సీఎం జగన్ రచ్చబండ కార్యక్రమానికి అంతా సిద్ధమైనప్పటికీ, డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. వైఎస్సార్ వర్థంతి సెప్టెంబర్ 2న గానీ, గాంధీ జయంతి అక్టోబర్ 2న గానీ ప్రారంభించాలని జగన్ భావిస్తున్నారు. వాస్తవానికి జగన్ రచ్చబండ కార్యక్రమాన్ని గతేడాదిలోనే ప్రారంభించాల్సి ఉండగా, కొవిడ్ కారణంగా ఆగిపోయింది.