
జీహెచ్ఎంసీలో కంచే చేను మేసింది! అందులో పనిచేసే ఉద్యోగే.. సంస్థకు కన్నం వేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. అక్షరాలా 4 కోట్ల రూపాయలు కాజేశాడు. జీహెచ్ఎంసీకి చెందిన వాణిజ్య సముదాయాల్లోని దుకాణాల నుంచి రావాల్సిన అద్దెను తన జేబులో వేసేసుకున్నాడు. ఇలా.. ఏకంగా 13 ఏళ్ల నుంచి చేస్తుండగా.. పాపం పండి ఇపుడు దొరికిపోయాడు.
ఈ 13 ఏళ్ల కాలంలో అతడు రూ.4,01,19,021 తన జేబులో వేసేసుకున్నాడు. ఇటీవల ఈ విషయం వెలుగులోకి రాగా.. పూర్తిస్థాయి విచారణ జరిపిన అధికారులు విస్తు పోయారు. దుకాణదారులు.. నగదు రూపంలో చెల్లించే డబ్బును తన సొంతానికి వాడేసుకున్న ఆ ఉద్యోగి.. చెక్కుల రూపంలో వచ్చే సొమ్మును మాత్రం జీహెచ్ఎంసీ ఖాతాలో జమ చేసేవాడు. ఆ ఉద్యోగి పేరు యు. గోవింద్ రాజ్. జీహెచ్ఎంసీ బేగంపేట సర్కిల్ లో రెంట్ కలెక్టర్ గా పని చేస్తున్నాడు. అంతర్గత విచారణలో అతడిపై వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో.. సస్పెండ్ చేశారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ డి.లోకేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.