
26. 37.11. ఈ నెంబర్ లు ఏంటి అనుకుంటున్నారా! శ్రీలంకతో జరిగిన మూడు వన్డే ల సిరీస్‌లో భాగంగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో టీం ఇండియా బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండే చేసిన పరుగులు.
ఈ పరుగుల ను గూర్చి భారత మాజీ డాషింగ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తనదయిన శైలిలో మాట్లాడాడు. మనీశ్‌కు మూడు వన్డేల్లో ఆడే అవకాశం వచ్చినప్పటికీ దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడంటున్నాడు
భారత జట్టు పూర్తిగా ఆధిపత్యం కనబరుస్తున్న సమయంలోనూ హిట్టింగ్ ఆడలేక, తనను నిరాశపరిచాడని పెదవి విరిచాడు. ఆ సమయంలోనే కొత్త ఆటగాళ్లు సూర్యకుమార్, ఇషాన్ కిషన్ ఆటతో ఆకట్టుకున్నారని, కాబట్టి మిడిలార్డర్లో మనీశ్‌ను ఇకపై చూసే అవకాశం ఉండక పోవచ్చని వీరూ అభిప్రాయపడ్డాడు. కాగా శ్రీలంకతో జరిగిన నామమాత్రపు చివరి మ్యాచ్‌లో ఓటమిపాలైన ధావన్ సేన.. 2-1తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సెహ్వాగ్ మాట్లాడుతూ… ‘‘హార్దిక్ పాండ్యా, మనీశ్ పాండ్యా.. ఇద్దరూ పెద్దగా రాణించలేదు. 15- 20 పరుగులు చేసేందుకు ఆయాస పడ్డారు. నిజానికి ఈ సిరీస్‌లో అత్యంత ప్రయోజనం పొందింది ఎవరైనా ఉన్నారంటే అది మనీశ్ పాండే. తను మూడు మ్యాచ్‌లు ఆడాడు. పెద్దగా ఒత్తిడి కూడా లేదు. అయినా, సత్తా చాటలేక పోయాడు. నాకు తెలిసి తనకు ఇక వన్డేల్లో చాన్స్ రాకపోవచ్చు… ఒకవేళ జట్టులో చోటు దక్కినా తనను తాను నిరూపించుకోవడానికి చాలా సమయం పడుతుంది. వీరి పరిస్థితి ఇలా ఉంటే, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ మిడిలార్డర్లో స్థానం సుస్థిరం చేసుకునేలా కనిపిస్తున్నారు’’ అని చెప్పుకొచ్చాడు. యువ ఓపెనర్ పృథ్వీ షా(43, 13, 49) కూడా మెరుగ్గా రాణిస్తున్నాడని ప్రశంసించాడు.