
జగన్ సర్కారు తీరుపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోమారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ బిల్లుల బకాయిల చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శలు చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రఘురామ ఓ ట్వీట్ చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను కలిసినట్టు చెప్పారు. ఎన్ఆర్జీ ఎస్ బకాయిల చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యం గురించి ఆయన వద్ద ప్రస్తావించినట్టు తెలిపారు. బకాయిలు సకాలంలో చెల్లించకపోవడం వలన కాంట్రాక్టర్లు పడుతున్న ఇబ్బందుల గురించి మంత్రికి వివరించినట్టు తెలిపారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయితీ రాజ్ శాఖా మంత్రి గౌరవనీయులు శ్రీ @girirajsinghbjp గారిని కలిసి NRGS బకాయిల చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యం గురించి మరియు బకాయిలు సకాలంలో చెల్లించకపోవడం వలన కాంట్రాక్టర్లు పడుతున్న ఇబ్బందుల గురించి వివరించడం జరిగింది. pic.twitter.com/U29qucDAGx
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) August 6, 2021
కాగా, తనపై అనర్హత వేటు వేయించాలన్న వైసీపీ ఎంపీల ప్రయత్నాలను రఘురామ ఎప్పటికప్పుడు తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కేంద్ర ప్రభుత్వ శాఖలకూ రఘురామ లేఖలు రాస్తుండటం గమనార్హం.