
India's Prime Minister Narendra Modi attends a meeting with US President Donald Trump and Japanese Prime Minister Shinzo during the G20 Osaka Summit in Osaka on June 28, 2019. (Photo by Brendan Smialowski / AFP)
ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవహారాల అక్రమాలు గుట్టు రట్టు కావడంతో.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జగన్ ప్రభుత్వం చర్యలపై డేగ కన్ను వేసింది. కేంద్ర పథకాల అమలు కోసం ఇస్తున్న గ్రాంట్లను.. జగన్ ప్రభుత్వం దారి మళ్లిస్తున్నట్లు గుర్తించింది. వేల కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టాయని నిర్ధారణకు వచ్చింది. కేంద్ర పథకాల్లో రాష్ట్ర వాటా సొమ్మును జమచేయడం లేదని తేల్చింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం.. ప్రతి పథకానికీ ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరిచి.. రాష్ట్ర వాటాను అందులో వేయాలని ఆదేశించింది. దీంతో.. ఏం చేయాలో పాలుపోని ప్రభుత్వం.. బ్యాంకర్ల వెంటపడింది. ఓడీ సౌకర్యం కల్పించాలని ప్రాధేయపడుతోంది. రాష్ట్ర వాటాను ఆయా ఖాతాల్లో జమచేయాలని కోరుతోంది. ఇప్పటికే ప్రభుత్వ డొల్లతనం బయటపడడంతో.. బ్యాంకర్లు ససేమిరా అనేశారు. తామంత సాహసం చేయలేమని తేల్చి చెప్పేశారు.
ఓ వైపు ఇన్ని అక్రమాలు వెలుగుచూస్తున్నా.. జగన్ ప్రభుత్వంలో ఏ మాత్రం మార్పు రావడంలేదు. ఇప్పుడు కొత్తగా మ్యాచింగ్ గ్రాంట్ల విషయంలోనూ మాయాజాలం ప్రదర్శిస్తోంది. కేంద్ర పథకాల అమలుకు వచ్చిన గ్రాంట్లను.. ఇతర అవసరాలకు మళ్లించేస్తోంది. తన వాటా నిధులు జమచేయకుండా ‘మేనేజ్’ చేస్తోంది. చేయని ఖర్చును చేసినట్లు చూపుతూ ఆడిట్ నే మోసం చేస్తోంది. ఈ విషయాన్ని కేంద్రం.. తాజాగా వెలుగులోకి తెచ్చింది. కేంద్ర పథకాల అమలు కోసం గడచిన రెండేళ్లలో రాష్ట్రానికి 30 వేల కోట్లు వచ్చాయి. వీటికి మ్యాచింగ్ గ్రాంట్ కింద రాష్ట్ర సర్కారు రూ.24 వేల కోట్లు జమ చేయాల్సి ఉంటుంది. కానీ.. ప్రభుత్వం ఆ మటే పట్టించుకోలేదు. కానీ, జమ చేస్తున్నట్లు పీడీ ఖాతాల్లో వర్చువల్ గా చూపుతోంది. బడ్జెట్ పద్దుల్లో కూడా ఖర్చును వర్చువల్ గానే చూపి.. ఆ లెక్కలనే అకౌంటెంట్ జనరల్ (ఏజీ)కి పంపి ఆమోదం పొందుతోంది. ఇక్కడి వరకు అంతా బాగేనే ఉన్నా.. వాస్తవంగా ఆ వ్యయం చేయకపోవడంతో.. కేంద్ర పథకాలు అమలు చేసే శాఖల్లో పెండింగ్ బిల్లులు కొండలా పేరుకున్నాయి. ఆ పథకాలకు సంబంధించి పనులు చేసిన కాంట్రాక్టర్లు, వెండర్లు, సప్లయర్లు ఇదే విషయమై నేరుగా కేంద్రానికే ఫిర్యాదులు చేశారు. కేంద్ర వాటా నిధులను కూడా చెల్లింపులకు వాడడం లేదని కేంద్రం చెవిలో వేశారు. దీంతో.. కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రంపై దృష్టి సారించింది. కేంద్ర పథకాల వారీగా ప్రత్యేక ఖాతాలు తెరిచి.. రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ ను ఆయా ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. అలాగే.. ఆ ఖాతాలకు సంబంధించిన లాగిన్, పాస్ వర్డ్ వివరాలు కూడా తమకు తెలియజేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖకు నిర్దేశించింది. కానీ, ఇంతవరకూ రాష్ట్రప్రభుత్వం ఆ పని చేయలేదు. ఇటీవల కేంద్రం ఒత్తిడి చేయడంతో.. సీఎం జగన్.. ఆర్థిక శాఖ అధికారులు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ భేటీలో రాష్ట్రప్రభుత్వం తెచ్చిన వింత ప్రతిపాదన విని బ్యాంకర్లు షాకయ్యారట. మ్యాచింగ్ గ్రాంట్ కింద జమ చేసేందుకు రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదని చెప్పిన జగన్.. బ్యాంకులే ప్రభుత్వ ఖాతాలో ఆ డబ్బు జమ చేయాలని కోరారట. కేంద్రం తన వాటా కింద ఇచ్చే నిధులు రాష్ట్ర ఖజానాలో జమ కాగానే.. బ్యాంకులకు ఆ సొమ్మును తిరిగి చెల్లించేస్తామని చెప్పారట. దీన్ని ఓడీ (ఓవర్ డ్రాఫ్ట్)గా భావించాలని వేడుకున్నారట. దీంతో.. విస్తుపోవడం బ్యాంకర్ల వంతయింది. ఇలా చేయడం తమ వల్ల కాదని బ్యాంకర్లు తేల్చి చెప్పేశారట. ఈ సందర్భంగా బ్యాంకర్లు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానమే లేకపోయిందని సమాచారం. డబ్బుల్లేవని మ్యాచింగ్ గ్రాంటే సమకూర్చలేని వాళ్లు.. ఓడీ మాత్రం ఎలా చెల్లిస్తారని బ్యాంకర్లు ప్రశ్నించారట. ఈ పరిస్థితుల్లో అసలుకేంద్రం వాటానైనా తమ బ్యాంకుల్లోని ఖాతాకు మళ్లిస్తారన్న నమ్మకం కలగడం లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే.. కేంద్రం నేరుగా తన వాటాను బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం కుదరదు. అకౌంటింగ్ లెక్కల కోసం వాటిని రాష్ట్ర ఖజానాకే ముందుగా తరలించాల్సి ఉంటుంది. ఒకసారి అలా పంపాక దానిపై అధికారం రాష్ట్రానిదే. ‘ఆ నిధులు సక్రమంగా వినియోగించడం లేదనే కదా కేంద్రం ప్రత్యేక ఖాతాలు తెరవాలని ఆదేశించింది! ఇప్పుడు రాష్ట్ర సర్కారు తీరు చూస్తుంటే.. ఖాతాలు తెరిచాక సక్రమంగా వాటిని మళ్లిస్తుందన్న గ్యారెంటీ లేదు’ అని బ్యాంకర్లు అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.